జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి

0 9,664

 

. . . సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేశ్

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త బీవీఆర్‌జీ చట్టాన్ని అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ వామపక్షాల పోరాటాల ఫలితంగా అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. గతంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందించేదని, ప్రస్తుతం వాటాను 60 శాతానికి పరిమితం చేసి మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని అన్నారు. కొత్త విధానంలో వ్యవసాయ పనుల సీజన్‌లో 60 రోజుల పాటు పనులను నిలిపివేయడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం, పని ప్రదేశంలో ఉదయం – సాయంత్రం ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే వేతనాలు నిలిపివేస్తామని నిబంధనలు పెట్టడం కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. అలాగే గ్రామపంచాయతీలకు పనుల ఎంపికలో అధికారాలు తగ్గిపోతాయని, పనుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూలీల పని హక్కును హరించే ఈ చట్టాన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో అమలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బీవీఆర్‌జీ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ప్రజాసంఘాలను కలుపుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ, కార్మికులు, రైతులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్ల పేరుతో బలహీనపరచే ప్రయత్నాలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి. రవి, జనాపల్లి నడిపి రాజన్న, గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అదే రోజు ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో సర్పంచ్ కిరణ్ కుమార్‌కు ఉపాధి హామీ కూలీలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇస్సపల్లి గ్రామంలో సర్పంచ్‌కు, చేపూరు గ్రామంలో గ్రామపంచాయతీ అధికారులకు కూడా కొత్త బీవీఆర్‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మరింత ఉద్ధృతమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.