29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేటు పాఠశాలల దోపిడీపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రైవేటు పాఠశాలల్లో నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 17న డీఈవోకు వినతిపత్రం సమర్పించి ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అధిక దోపిడీ, అక్రమంగా నడుస్తున్న పాఠశాలల అంశాలను తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో నిరసనగా డీఈవో కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలు నోట్‌బుక్స్, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. ఈ దోపిడీని అరికట్టేందుకు విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అవసరమైన అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించలేదని పేర్కొన్నారు. అక్రమంగా నడుస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదని, వెంటనే వాటి పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై అధికారులు స్పందించకపోతే త్వరలోనే వెయ్యి మంది విద్యార్థులతో మరోసారి డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీజీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండి సమీర్ ఖాన్‌తో పాటు అజయ్, ప్రణయ్, నవీన్, యోగేష్, అక్షయ్, కార్తీక్, సందీప్ తదితర టీజీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article