. . . సీపీఎం అభ్యర్థి బెజగం సుజాతకు మద్దతు ప్రకటించిన ఆర్ఎస్పీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వామపక్ష పార్టీలు బలపరిచిన సీపీఎం అభ్యర్థి బెజగం సుజాతని గెలిపిస్తేనే 11వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన పునాది పడుతుందని ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. 11వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మురికి కాలువలు, మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికార పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపోరాటం ద్వారా ఇండ్ల స్థలాలు సాధించిన లబ్ధిదారులందరికీ పట్టాలు అందించాలంటే వామపక్ష అభ్యర్థి విజయం అవసరమని స్పష్టం చేశారు. ప్రజలు బూర్జువా, మతోన్మాద పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా, కులం–మతం పేరుతో రాజకీయాలు చేసే శక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య నిరంతరం ఉంటూ, వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే నాయకత్వాన్నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు యశోద, లక్ష్మీబాయి, అన్నపూర్ణ బాయ్, సారిక, సుందర్ బాయ్, సునీత, రజియా, ఆర్ఎస్పీ నాయకులు బోడా అనిల్, పిట్ల నరేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

