27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా – జమున తెహజీబ్‌కు ప్రతీక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

 

. . . అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

 

. . . అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే ఆశాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని మంత్రి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గోల్కొండ జగదాంబికా అమ్మవారి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నదని అన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూలై 16 న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి జూలై 16, 19, 23, 26, 30, ఆగష్టు 2, 6, 9, 13 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక, ప్రత్యేక బస్సులు తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా గోల్కొండ కోట పరిధిలోని రహదారులు, మెట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే భక్తుల దర్శనం సాఫీగా సాగేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

 

The Hyderabad Ashada Bonalu festivities are a symbol of Telangana's Ganga-Jamuni Tehzeeb.

 

అనుమానితుల ఫొటోలతోకూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.  జిహెచ్ఎంసి కాలపరిమితిని నిర్దేశించుకుని పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు. విద్యుత్ శాఖ కరెంటు వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణీలు బాలింతల విషయంలో అన్ని శాఖలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ ఆదేశించారు.  దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సహకరించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలని మంత్రి సురేఖ గారు ఆదేశించారు.  గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవమని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను మంత్రి కొండా సురేఖ గారు ఆవిష్కరించారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారి దేవస్థానానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి సురేఖ ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదాంబికా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వర్షాలతో, పాడిపంటలతో పచ్చగా వుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొండా సురేఖ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, జిహెచ్ఎంసి, ఐ అండ్ పి ఆర్ తదితర శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

The Hyderabad Ashada Bonalu festivities are a symbol of Telangana's Ganga-Jamuni Tehzeeb.

More articles

Latest article