29 C
Hyderabad
Monday, August 3, 2026

క్లాసు వైపు కన్నెత్తి చూడని హెడ్మాస్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆఫీసు రూమే ప్రపంచం

 

. . . బిచ్కుంద గణేష్ మందిర్ పాఠశాల హెడ్ మాస్టర్ నిర్వాహకం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ అంటే పాఠశాలకు నాయకుడు. విద్యార్థులకు దిక్సూచి. కానీ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఈ నిర్వచనానికే తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెడ్మాస్టర్ వారానికి కనీసం 8 పీరియడ్లు బోధించాలి. ఒక పూర్తి సబ్జెక్టును ఒక తరగతికి తీసుకోవాలి. అకడమిక్ మానిటరింగ్, టీచింగ్ అబ్జర్వ్ చేయడం, పీటీఎం లు, అసెంబ్లీ నిర్వహణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించాలి. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయన ఉదయం స్కూల్‌కు వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆఫీసు రూమ్‌కే పరిమితం. కుర్చీలో నుంచి లేవడం లేదు. రికార్డులు, ఫైళ్లు తప్ప క్లాసు గదుల వైపు కన్ను సైతం తిప్పడం లేదు.

. . . బోధన పూర్తిగా శూన్యం

వారానికి 8 పీరియడ్ల నిబంధన గాలికొదిలారు. ఒక్క పీరియడ్ కూడా క్లాసులోకి వెళ్లడం లేదు. దీంతో సబ్జెక్టు టీచర్లపై పని భారం పెరుగుతోంది. ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారా, సిలబస్ సకాలంలో పూర్తవుతుందా, విద్యార్థుల పనితీరు ఎలా ఉందో సమీక్షించడం లేదు. అసెంబ్లీ, పీటీఎం లు, క్రమశిక్షణ, విద్యార్థుల సమస్యల పరిష్కారం వంటివి పట్టించుకోవడం లేదు. లైబ్రరీ, ల్యాబ్ పీరియడ్లు, స్కూల్ ఈవెంట్స్ అన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పాఠశాలలో 57 మంది చిన్నారులు చదువుతున్నా, వారికి సరైన నాయకత్వం లేకపోవడంతో అకడమిక్ నాణ్యత పడిపోతోంది. ఉపాధ్యాయులు కూడా “హెడ్ సార్ రూమ్ నుంచి బయటకు రారు” అంటూ వాపోతున్నారు. తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చినా ఆయనను కలవడానికి అవకాశం లేక వెనుదిరుగుతున్నారు.

More articles

Latest article