- ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
- ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత సమావేశం
నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని, కనీసం సర్వే చేయలేదని నష్టం వివరాలు అంచనా వేయకపోవడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామస్థులను పంట నష్టంపై శనివారం రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు. గోదావరి పరివాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడు లేనంత నష్టం జరిగిందని, ఇది దేవుడు చేసింది కాదని ఈ సారి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసిన పాపమిదని ఆరోపించారు. పొలాల్లో పది రోజులు నీళ్లు నిలబడి ఉన్నాయని, అంతకుముందు మనం వరదలు వచ్చిన తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండేవాళ్లమన్నారు. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదని, యూరియ కూడా ఇవ్వటానికి సరైన ప్రణాళిక లేదన్నారు. యూరియ ఇవ్వటానికి కూడా రైతులను లైన్లలో నిలబెట్టారని, యూరియ గురించే తెలియని ప్రభుత్వానికి ఇక నీళ్ల గురించి ఏం తెలుస్తుంది? ఎస్సారెస్పీ నుంచి అవసరాన్ని బట్టి నీళ్లు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కానీ ఈసారి అలాగే నిల్వ ఉంచారని మొత్తం గేట్లు ఎత్తకుండా సగమే ఎత్తారని, అంటే రైతులను మోసం చేయటంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరు చెప్పి ఏమీ చేయలేదని, రెండేళ్లు అనేకం భరించామని,రెండేళ్లలో ఒకేసారి బోనస్ ఇచ్చి ఉషారుతనం అంతా రైతుల దగ్గరనే ప్రదర్శిస్తున్నారన్నారు. రైతులు పంట సగం అమ్ముకున్న తర్వాత కాంటాలు పెడుతున్నారని, కొంత పంట మాత్రమే కొని కొందరికే బోనస్ ఇస్తున్నారని, మన కళ్లముందు జరుగుతున్న మోసాలనే నేను చెబుతున్నానన్నారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సహా ఖమ్మం మంత్రులు మా నిజామాబాద్ రైతులను ముంచారని, తుమ్మల మీరు తెలంగాణకు మంత్రి అని మరిచిపోవద్దని, అందరూ రైతుల గురించి ఆలోచించాలని, మా నవీపేట మండలంలోని 9 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కలెక్టర్ కు ఎమ్మార్వోలు తప్పుడు లెక్కలు రాశారని, మళ్లీ అధికారులను పంపించి నీతిగా నిజాయితీగా లెక్కలు రాయించాలని, కేసీఆర్ హయాంలో మనం అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను 9 వేల మందిని పెట్టుకున్నామన్నారు. వారంతా సరైన లెక్కలు రాసి కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలని కోరుతున్నానన్నారు. పది రోజుల పాటు పంట మునగటంతో రైతులు పుట్టెడు శోకంలో ఉన్నారని, వారికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కలెక్టర్ నవీపేట్ మీరే వచ్చి విజిట్ చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని సీఎంను, వ్యవసాయ మంత్రిని డిమాండ్ చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతుల సమస్యపై దయచేసి శ్రద్ధ పెట్టాలని, మీరు చెబితే తప్పకుండా కలెక్టర్ వింటారని, బోధన్ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మక్క ఇప్పటికే వచ్చి ఉన్నదని, ఇంత వరకు పట్టించుకోవటం లేదని పసుపు పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పి పట్టించుకోవటం లేదన్నారు. సోయ రైతుల పంటను కూడా కొనుగోలు చేయలేదని, రైతులకు సంబంధించి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నానన్నారు. మహిళలకు రూ. 2500, తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని, ఆయన తులం బంగారం ఇస్తా అన్న తర్వాత రేట్లు భారీగా పెరుగుతున్నాయని, ధరలు ఆకాశానికి అంటకముందే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ను 4 వేలు చేయాలని, ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ఏమని చెప్పాలని, బతుకమ్మ చీరలు రెండు ఇస్తామన్నారని,కానీ తెలంగాణ తల్లి చేతుల నుంచే బతుకమ్మను తీసేశారన్నారు. గెలవటానికి బొంకిండు తప్ప రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద, బతుకమ్మ మీద ప్రేమ లేదని విమర్శించారు. పిడికిలెత్తి పోరాటం చేస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఇక్కడి రైతుల సమస్యను ఇంతటితో వదిలి పెట్టనని, సీఎం, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కలెక్టర్ కచ్చితంగా రైతుల వద్దకు రావాలని, రేపు నిజామాబాద్ లోనే ఉంటానని, అవసరమైతే రైతులతో కలిసి కలుస్తానన్నారు.

