. . . టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తలసేమియా బాధిత చిన్నారుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా వార్డును మహేష్ గౌడ్ సోమవారం సందర్శించారు. వార్డు లో చికిత్స పొందుతున్న తలసేమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలు, చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులును రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రక్త సరఫరా, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల కోసం రెడ్‌క్రాస్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, జిల్లా రెడ్‌క్రాస్ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి అవసరమైన వైద్య సేవలు, రక్తం, ఇతర సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, రాష్ట్ర గీత కార్మిక సంస్థ చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
