. . . నందిపేట్‌లో ఉచిత ఎన్‌సీడీ వైద్య శిబిరం
. . . సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం
నందిపేట్, బతుకమ్మ :
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నందిపేట్ గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం సిలిండర్ లింగం పిలుపునిచ్చారు. నందిపేట్ మండల కేంద్రంలోని హనుమాన్ గల్లీ దుర్గాదేవి ఆలయం ప్రాంగణంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలి మార్పులతో రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సంక్రమిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వ్యాధులు తీవ్రం కాకముందే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన అన్నారు. శిబిరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర (షుగర్) స్థాయి, థైరాయిడ్, మలేరియా, డెంగ్యూ, సాధారణ జ్వరం తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. వైద్యుల సలహాల మేరకు అవసరమైన రోగులకు ఒక నెలకు సరిపడా ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జీవనశైలిలో పాటించాల్సిన జాగ్రత్తలను వైద్య బృందం వివరించింది. 82 మంది, వైద్య పరీక్షలు చేసుకొని మందులు తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి వార్డు సభ్యులు కస్తూరి గంగాధర్, చేపూర్ వినీత్ కుమార్, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
