. . . పీవోడబ్ల్యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రపంచ వ్యాప్తంగా యుగాలు మారినా, తరాలు మారినా, మహిళల తలరాత మారలేదని, అసమానత్వం, అణచివేత, విపక్ష పురుషాధిక్యత వంటి సమస్యలు సమసి పోలేదని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి లు మాట్లాడుతూ గత 12సం॥లుగా బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగానే మహాత్మాగాంధీ ఉపాది హామి చట్టం పేరు విధివిధానాలు మార్చి, వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చిందని, ఈ చట్టం ద్వారా ఉపాధి లేని పేదలకూ, వృద్ధులకూ, వికలాంగులకూ, నైపుణ్యం లేని వారికి పని హక్కును కల్పించిందని, ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారిలో 60% మంది మహిళలే వున్నారన్నారు. అంతేగాకుండా మహిళా సమాన వేతన చట్టం అమలవుతుందని, ఇటువంటి చట్టాన్ని రద్దు చేయటమంటే ప్రజల ప్రాథమిక హక్కుపై దాడి చేయటమేనన్నారు. అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత వుందని, చారిత్రిక పోరాటాల నేపథ్యం వుందని, కొన్ని బూర్జవ శక్తులు మహిళా దినోత్సవాన్ని, పోరాట దినోత్సవంగా కాకుండా, ఇదొక పండుగలా సన్మానాలు, సంబరాలు చేసుకుంటూ మహిళలని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. హక్కుల సాధన కోసం మహిళలు రక్తతర్పణలు చేసిన రోజు 1908 మార్చి 8ను ప్రపంచ మహిళల పోరాట దినంగా జరుపుకోవాలని 1910లో కోపెన్ హెగిన్లో జరిగిన మహాసభలో జర్మనీ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు కార్లా జట్కిన్ ప్రతిపాదించి ఆమోదింప చేశారని తెలిపారు. మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మార్చి 8 సందర్భంగా మన కర్తవ్యాన్ని దృఢంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, శకుంతల సహాయ కార్యదర్శిలు గౌర, బిపాషా జిల్లా నాయకులు జమున, నర్సక్క అమూల్య, ఆశలత, కీర్తి, అంబిక, మానస, పూజ, రెహానా, విజయ, భూదేవి, సునీత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

