26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కామ్రేడ్ నాగన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుత ఫాసిస్టు కాలంలో ప్రజల పక్షాన నిక్కచ్చిగా నిలిచిన కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణం విప్లవోద్యమానికి, భారత విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఇటీవల మరణించిన విప్లవ సాంస్కృతిక కార్యకర్త కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, కామ్రేడ్ నాగన్న సమాజ మార్పుకు ప్రజాయుద్ధ పంథానే మార్గమని, ప్రజల విముక్తి నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే సాధ్యమని విశ్వసిస్తూ తాను ఎంచుకున్న రాజకీయ సిద్ధాంతాల పట్ల తుది శ్వాస వరకు అవిరామంగా కృషి చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి జీవితాంతం వరకు ప్రభుత్వ విధానాలను తన పాటల ద్వారా విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడంలో నాగన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన పీడీఎస్‌యూ మహాసభల్లో తన విప్లవ గీతాలతో విద్యార్థులను ఉత్తేజపరిచిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. నాగన్న ఆశయాల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని విద్యార్థి, యువజనులకు పిలుపునిచ్చారు. ఈ నివాళి కార్యక్రమంలో పీడీఎస్‌యూ తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి గౌతం రాజ్, జిల్లా నాయకులు రాకేష్, హుస్సేన్, నిఖిల్, నిజామాబాద్ నగర అధ్యక్షుడు పవన్, తెలంగాణ యూనివర్సిటీ నాయకులు దినేష్, కార్తీక్, జ్ఞానేశ్వర్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article