. . . సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 15న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఉద్యోగాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి ఆ హామీని విస్మరించిందని, పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాలను కూడా తగ్గిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, తగిన నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందని అన్నారు. దీంతో ఉద్యోగాల కోసం వేలాది మంది యువత హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అప్పుల భారం, ఉద్యోగాల లేమితో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, ముఖ్యంగా 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాల్లో వెంటనే నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల సాధన కోసం సీపీఎం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొంటూ, జూలై 15న జరిగే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పెద్ద వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.
