. . . తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా సేవాలాల్ 287వ జయంతి వేడుకలు..
. . . బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని సంఘ సంస్కర్త కూడా అని బంజారా జాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భోగ్ బండార్ నిర్వహించి, సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, బంజారాలకు, ఆదివాసీలకు ఈ ముఖ్యమంత్రి లొల్లి పెట్టిస్తున్నాడని ఆరోపించారు. జీవో 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ సందేశం ప్రకారం జాగృతి ముందుకు వెళ్తుందన్నారు. సేవాలాల్ జయంతి, శివరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోజుమహారాజు భిక్షు మహరాజ్ శివరాజ్ మహారాజ్ లాంటి గొప్పవాళ్లు రావటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బంజారా ఆధ్మాత్మిక గురువులందరికీ నమస్కారాలు తెలిపారు. ఆనాడు బ్రిటీష్ వాళ్లు ట్రైబల్స్ ను క్రిమినల్ ట్రైబ్స్ అని ఉంటే ఖడ్గం ఎత్తి పోరాటం చేశారని గుర్తు చేశారు. సేవాలాల్ దేశ వ్యాప్తంగా బంజారా జాతి మేలు కోసం కృషి చేశారన్నారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్ ను కేటాయించాలన్నారు. అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయి. కానీ జాగృతి మాత్రం మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందన్నారు. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి అచ్చంపేట అడవుల్లో 20 ఎకరాల్లో సేవాలాల్ స్మారకం పెడతామంటున్నారని హైదరాబాద్ లో కూడా సేవాలాల్ విగ్రహం పెట్టాల్సిందేనన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బంజారాలు లేని మంత్రివర్గం ఉండేది కాదని, కానీ ఈ ప్రభుత్వంలో దారుణంగా లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. వెంటనే వారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోలేదని, అసైన్డ్ భూముల విషయంలో సీఎం ఒక స్టాండ్ తీసుకోవాలన్నారు. పోడు పట్టాల పంపిణీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ పేరుతో ఆదివాసీల పేరుతో ఎరుకల తెగ పేరుతో ఏర్పాటు చేస్తామన్న మూడు కార్పొరేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. నల్కొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ లో ఐటీడీఏ లు పెట్టాలన్నారు. జాగృతి తరఫున మేము ఒక్క సీటు గెలుచుకున్నాం. కానీ ఆ సీటును కూడా లాక్కునేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అడిగే వాళ్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులరా మీకన్నా కూడా ప్రతిపక్షం వారినే సీఎం ముందు కలుస్తున్నాడని విమర్శించారు. మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. మీకు నిధులు రాకపోతే ఓటర్లకు మీరిచ్చిన హామీల సంగతేంటని అన్నారు. ఇట్ల ప్రతిపక్షాలు ఉండకుండా చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అన్నారు. ఏ పార్టీలో గెలిచిన సరే బీఆర్ఎస్ లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోందని వారికి కూడా ప్రజలు బుద్ది చెబుతారన్నారు.
