27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ‘అట్టర్ ఫ్లాప్’ సినిమానే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇంటర్వెల్‌కే అట్టర్ ఫ్లాప్ అయిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది

 

. . . సగం పాలనా కాలం గడిచినా హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదని, సగం కాలం ముగిసినా ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్లనే వెన్నుపోటు పొడిచారన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అని కేటీఆర్ అన్నారు. ఆమెపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చెప్పినందుకే రేవంత్ పగపట్టారన్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో దొంగ కేసు పెట్టించారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కుట్ర గురించి సమాచారం కూడా లేకుండానే ఆమె రాజ్యసభకు నామినేషన్ వేసిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి తాను పెట్టిన దొంగ కేసు వివరాలు బీజేపీ పార్టీకి లీక్ ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. అలాగే సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు మిగిలింది ఎండ్ కార్డే అన్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ. 4 వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్, ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని అన్నారు.

 

The Congress party's two-and-a-half-year rule has been nothing but an 'utter flop' movie.

 

త్వరలో ఉపఎన్నికలు వస్తాయన్న కేటీఆర్, ఆ ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నరేళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సాయాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. “జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో ఒక్క ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు హైదరాబాద్‌లో కరెంట్ సమస్యలు ఉండేవి, కానీ కేసీఆర్ పాలనలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించాం. ఎండాకాలం వచ్చిందంటే కుండలతో ధర్నా చేసే పరిస్థితి ఉండేది, కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తాం. 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే అని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కేటీఆర్ గుర్తుచేశారు. “నిజాం కాలం తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి నిర్మించలేదు. కానీ కేసీఆర్ నాలుగు టిమ్స్ ఆస్పత్రులను, వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి, బసవతారకం ఆస్పత్రిలో పేద రోగుల సహాయకుల కోసం ధర్మశాలలు కట్టించారు. రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మనది. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశాం, మూడోసారి కూడా సిద్ధం కావాలి. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన దానం నాగేందర్ వల్ల త్వరలో ఇక్కడ ఉపఎన్నిక రావడం ఖాయం. ప్రతి ఓటు విలువైనది, జూబ్లీహిల్స్‌ లో లాగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే “ఎస్ఐఆర్” నమోదులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలి. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలి. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నాం, టికెట్ ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ సచివాలయానికి ఆయన పేరు పెట్టారు. అంబేద్కర్ చెప్పినట్లుగా జనగణన, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే డా. సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

The Congress party's two-and-a-half-year rule has been nothing but an 'utter flop' movie.

More articles

Latest article