. . .తినేందుకు తిండి లేదు … తలదాచుకునేందుకు నీడ లేదు
. . . వృద్ధ దంపతుల ఆవేదన
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ ఎర్రపాడు గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి – రాజయ్య అనే వృద్ధ దంపతుల బతుకుచిత్రం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అది ఇల్లు కాదు మూడు కర్రల మధ్యన కట్టిన ప్లాస్టిక్ తాటిపత్రి కాస్త గట్టిగా గాలి వీచినా ఎగిరిపోయే ఆ ప్లాస్టిక్ కవర్ కిందే ఆ వృద్ధ దంపతుల ప్రపంచం నడుస్తుంది. ఒకవైపు కడు పేదరికం. మరోవైపు రోగాలమయమైన వృద్ధాప్యం వెంటాడుతున్నా తల దాచుకోవడానికి కనీసం ఒక చిన్న గూడు కూడా లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆకలి తీర్చే బడి బడి ఆవరణను ఊడుస్తూ వయస్సు పై పడటంతో వీరికి కూలి పన్నులు చేసే ఓపిక లేదు. వీరికి తోడుగా ఒక మనవరాలు ఉంది. ఆ పాప బాధ్యత కూడా ఈ వృద్ధులపైనే పడింది. ఆ గ్రామంలోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనమే ఈ వృద్ధ దంపతుల ఆకలి తీరుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ బడి ఆవరణను ఊడుస్తూ కాలం గడుపుతున్నారు. సొంతగా ఒక చిన్న గూడు కట్టుకోవాలని ఉన్నా రూపాయి తీసి రూపాయి పెట్టె స్తోమత వీరికి లేదు. అందుకే ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తారేమో అని ఆశగా, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూ స్తు న్నారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే ఎలాగో డబ్బులు వస్తాయని, ఆ వచ్చే డబ్బులను నమ్ముకొని, ఎవరైనా పెద్దమనసున్న దాతలు ముందుకు వచ్చి సాయం చేయకపోతారా ? ముందుకు వచ్చి మాకు ఒక చిన్న గది అయినా కట్టించి ఇవ్వకపోతారా, అనే ఆశ ఆ వృద్ధ దంపతులను ప్రతిక్షణం వెంటాడుతోంది. ఎవరైనా సహాయం చేస్తే ఈ తాటిపత్రి నరకం నుంచి బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాం అంటూ ఆ వృద్ధులు కన్నీళ్ళతో వేడుకుంటున్నారు.