. . . మానవత్వంతో రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి
. . . రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గుప్తదానం కంటే రక్త దానం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్త దానాలలో పాల్గొని ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు. ఆదివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రేస్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో లోక్ భవన్ లో అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రక్త దాతలకు, రక్త ప్రోత్సాహకులకు, సంస్థలకు, రక్తనిధులకు అవార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా అత్యధిక రక్త దానాలు చేయించినందుకు నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య కు అవార్డు రాగా, కమిషనర్ తరపున అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ కి అవార్డు అందజేశారు. అత్యధిక సంఖ్యలో రక్తదాతలను ప్రోత్సహించినందుకు జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామన్ రెడ్డి కి అవార్డు రాగా, అతని తరపున జనరల్ సెక్రటరీ ప్రశాంత్ అవార్డు ను అందుకున్నారు. అనంతరం లోక్ భవన్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 87 సార్లు రక్త దానం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కర్పు రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య నారాయణ పాల్గొన్నారు.

