. . . బాన్సువాడలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా వెయ్యి మందికి పైగా చేరికలు
. . . విజయంపై ధీమా వ్యక్తం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, రాబోయే ఎన్నికల్లో బాన్సువాడలో బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త మొరెలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ద్రోహం చేసిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించిన ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. బాన్సువాడలో కొందరు నాయకులు పార్టీని వీడినప్పటికీ, ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌కు బలమైన కార్యకర్తల బలం ఉందని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఇతర స్థానిక నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడలో జరిగిన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మొరెలి శ్రీనివాస్ రావు కూడా కేసీఆర్ పట్ల ఉన్న నిబద్ధతతోనే బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటు అధికార పార్టీ చేయించిన సర్వేలలో కూడా బాన్సువాడలో బీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎవరు పోటీ చేసినా ప్రజలు బీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని, పాత–కొత్త అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా పనిచేసి బాన్సువాడలో మరోసారి బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, విఠల్ రావు, యలమంచిలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, రత్నకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

