. . . నిజామాబాద్ జిల్లా వికలాంగుల ఇంచార్జి కంటం కలిమ్
నందిపేట, బతుకమ్మ :
వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా వికలాంగుల ఇంచార్జి కంటం కలిమ్ డిమాండ్ చేశారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలో నందిపేట, డొంకేశ్వర్ మండలాల వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా, అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటం కలిమ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై సమగ్ర చర్చ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చట్టసభల్లో సమర్థంగా ప్రస్తావించకపోవడం వల్ల వారి హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన కీలక అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ.6,000లకు పెంచడం, ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయడం, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయడం, వికలాంగుల హక్కుల చట్టం–2016ను సమర్థంగా అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న కొత్త పింఛన్లను మంజూరు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీలో ఒక మహిళా వికలాంగురాలు, ఒక పురుష వికలాంగుడికి కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్‌తో పాటు ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి రాజ్యాధికారంలో వారి వాటాను ఖరారు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కంటం కలిమ్ హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మంది వికలాంగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో నందిపేట మండల వికలాంగుల అధ్యక్షురాలు సంగోళ్ళ లక్ష్మి, డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు సీహెచ్ భూమేశ్వర్, కోశాధికారి పెద్దగొండ సాగర్, హనుమంత్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొనగా, ఇరు మండలాల గ్రామాల నుంచి వికలాంగుల సభ్యులు హాజరయ్యారు.
