27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టిప్ లో ఆ వర్గం..

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడ నియోజక ‘వర్గం’ వారే
  • ఐదు నియోజకాలలో రైతులు లేరంట..?
  • పారదర్శకం లేని కమిటీ ఎంపిక
  • విజయ డెయిరీలో తవ్వినకొద్ది అక్రమాలు

నిజామాబాద్, బతుకమ్మ:

విజయ డెయిరీలో అత్యంత కీలకంగా, ఆర్ధిక లావాదేవిలతో కూడుకొని ఉన్న పథకం టిప్. జమకూడిన డబ్బులను రైతుల పాడి, పశువుల అభివృద్ధి కోసం వినియోగిస్తుంటారు. సమగ్ర నిర్వహణ కోసం, దీనికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. డెయిరీ అధికారుల అలసత్వం వల్ల ఒక సామాజిక వర్గానికి, అందులోనూ ఒకే నియోజకవర్గానికి చెందినవారిని నియమించారు. ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ, ముగ్గురితోనే కమిటీని రూపొందించడం విశేషం. దీనివల్ల టిప్ (టెక్నికల్ ఇన్ పుట్ )లో చేరిన లక్షల రూపాయలు పక్క దారి పట్టాయనే ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి.

  • నిధుల కైంకర్యం కోసమేనా…?

పాడి రైతులకు రాయితీ రూపంలో ఇవ్వాల్సిన టిప్ నిధులను కైంకర్యం చేసేందుకే కమిటీ వేయడంలోనూ పక్షపాత ధోరణిని కనబరిచినట్లు తెలుస్తోంది. జిల్లాలోని నలుమూలాల నుంచి డెయిరీకి చెందిన సొసైటీలు ఉన్నాయి. అందరికి సమన్యాయం కలిగించే విధంగా కమిటీ వేయాల్సి ఉండగా ఒకే వర్గానికి ప్రాతినిద్యం ఇవ్వడంతో కొందరు రైతులలో ఆగ్రహం పెల్లుబికుతోంది. రైతుల సంక్షేమంకన్నా అధికారుల స్వలబ్ది కోసమే కమిటీ వేసినట్లు కనబడుతోంది. పాల సేకరణలో భాగంగా ప్రతి లీటర్ వెంట తీసుకునే పైసలను టిప్ ఖాతాలో జమచేస్తారు. ఈ డబ్బులను రైతులకు ఉపయుక్తమయ్యే విధంగా కమిటి తీర్మానించి కొనుగోలు అనంతరం రాయితీపై అందజేయాల్సి ఉంటుంది. టిప్ నిధులను ఎలాంటి పరిస్థితులలోను నిర్మాణ, మరమ్మతు పనులకు వాడరాదనే నిబంధనలు ఉన్నాయి. దీనిని కాలరాస్తూ గత కొంత కాలంగా రైతులకు సంబంధం లేనివాటిపై చెక్కులు రాసుకొని నిధులు దిగమింగారనే చర్చ జిల్లా రైతులలో జరుగుతోంది.

  • ఐదు నియోజకవర్గాలకు మొండిచేయి..

నిజామాబాద్ జిల్లాలో మిల్క్ షెడ్ ఉన్నప్పటికి, టిప్ లో ప్రాతినిద్యానికి నోచుకోలేకపోయారు. ఐదు నియోజకవర్గాల పాడి రైతులకు మొండిచేయి చూపించారు. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత నిజామాబాద్ నుంచి విడిపోయిన కామారెడ్డిలో టిప్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ జిల్లాలోను కమిటిని ఎన్నుకునే సందర్భంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన రైతుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక్కడ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం వారిని టిప్ కమిటిలో నియమించడంతో కళ్ళు తెరిచిన రైతులు, చాపకింద నీరులా ఆగ్రహజ్వాలలు విసురుతున్నారు. విజయకు పాలు పంపకపోవడం చూస్తే, అధికారుల ఒంటెద్దు పోకడ వల్లనే రైతులు ప్రతి విషయంలోనూ సంస్థకు దూరం అవుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులోని ప్రతి నియోజకవర్గానికి ఒకరి చొప్పున వివిధ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి తీసుకుంటే, డెయిరీకి చెందిన నిధులు దుర్వినియోగం గాకుండా ఉండేవనే మాటలు వినబడుతున్నాయి. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల వారు కలిసి ఏర్పాటు చేసుకున్న పాడి రైతు సొసైటీ సభ్యులే విజయ డెయిరీకి పాలు పంపిస్తుంటారు. ఇది అన్ని వర్గాల (టెక్నికల్ ఇన్ పుట్) పాడి రైతులకు అందవలసిన పథకం. దీనిని నీరుగార్చేందుకు విజయ డెయిరీ అధికారులు పన్నిన కుట్రలో భాగంగానే ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More articles

Latest article