. వివాదాలతో సతమతమవుతున్న విద్యాశాఖ
. మితిమీరుతున్న యూనియన్ ల జోక్యం
నిజామాబాద్, బతుకమ్మ: పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు పంచాయితీలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ ల మెట్లు ఎక్కుతున్నారు. ఉపాధ్యాయులపై అధికారులు అజమాయిషీ లేకపోవడంతో వరుస వివాదాలతో విద్యాశాఖ సతమతవుతోంది. హెడ్మాస్టర్లు, టీచర్లకు మధ్య విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాఠ్యాంశాల బోధన, విద్యార్థులను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించాల్సిన ఉపాధ్యాయులు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారు. మొన్నటి వరకు ఎంఈవోల వ్యవస్థ ఉండగా.. ఇప్పుడు ప్రతి మండలానికి సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్ కు ఇన్ చార్జి బాధ్యతలు ఇచ్చిన తరువాత జిల్లాకు కొత్త విద్యాశాఖాధికారి వచ్చిన వేళా విశేషమో తెలియదు కానీ వివాదాలు జిల్లా విద్యాశాఖను కలవర పెడుతున్నాయి. ఏడాది కాలంగా ధర్పల్లి జిల్లా పరిషత్ హెడ్మాస్టర్ పై ఆరోపణలు, వ్యవహర శైలి నేపథ్యంలో విద్యాశాఖ సంచాలకులు వేటు వేసిన తరువాత కూడా జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీల్లో చోటు చేసుకుంటున్న వివాదాలు విద్యాశాఖను రోడ్డున పడేస్తున్నాయి.
ధర్పలి మండలం దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల మద్య విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ఈ వివాదం సద్దుమణిగేలా చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఇక్కడి ముగ్గురు టీచర్లను యూపీఎస్ కు డిప్యుటేషన్ పై పంపించారు. ఓ యూనియన్ నాయకుల జోక్యం కారణంగానే హెడ్ మాస్టర్ కు అనుకూలంగా టీచర్లకు డిప్యుటేషన్ వేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హెడ్మాస్టర్, టీచర్ల మద్య గొడవలకు పదో తరగతి విద్యార్ధులను బలి చేస్తున్నారని, పరీక్షల వేళ టీచర్లకు డిప్యుటేషన్ ఏమిటని విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్ని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టిచర్ల మధ్య చోటు చేసుకున్న గొడవలు స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరాయి. మోడల్ స్కూల్ కు ఇటీవల బదిలీపై వచ్చిన కొందరు ముదురు టీచర్ల వ్యవహర శైలే వివాదాలకు కారణమని తెలిసింది. రెంజల్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు, టీచర్లకు మద్య సమయ పాలన పంచాయితీ కొనసాగుతోంది. రూల్స్ విషయంలో వచ్చిన విభేదాల విషయంలో ఏకంగా సదరు ప్రిన్సిపాల్ తమ కమ్యూనిటీ పేరు చెప్పి ప్రభుత్వం తమదేనన్నట్లు బెదిరించడం కలకలం రేపింది. ఏడాదికాలంగా కొనసాగుతున్న మాక్లూర్ కేజీబీవీ పంచాయితీలో కొందరిని బదిలీ చేసిన విద్యశాఖ అధికార పార్టి నేతల ఒత్తిడికి తలొగ్గి మరికొంతమందిపై చర్యలు తీసుకోకపోవడంతో వారు మళ్లీ గత వివాదాలను మనసులో పెట్టుకుని టీచర్లను బూతులు తిడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
యూనియన్ ల నేతలే కారణమా..?
విద్యాశాఖలో వివాదాలు ఆదినుంచి ఉన్నవే. అయితే ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖాధికారులు తమ చెప్పుచేతుల్లో ఉండాలనే యూనియన్ నేతల వైఖరి విద్యాశాఖను రోడ్డున పడేస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం మొదలుకొని ఎంఆర్సీలలో చివరకు ప్రైమరీ స్కూల్ టీచర్ల విషయం లో ఉపాధ్యాయ సంఘాల జోక్యం మీతిమిరిపోతోంది. ఉపాధ్యాయులు అసలు పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారా? లేక సొంత వ్యాపకాల్లో తలమునకలవుతున్నారా? అనే దానిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. దీంతో కొందరు తాము గెజిటెడ్ లమని, సీనియర్లమని, నాయకులమని, ప్రిన్సిపాళ్లమంటూ విధి నిర్వహణలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుండటమే వివాదాలు నెలకొనడంలో ప్రధాన కారణం. ఈ విషయంలో విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకుండా మోకాలడ్డుతున్నారు యూనియన్ లీడర్లు. లీడర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉండగా జిల్లా , మండల విద్యశాఖాధికారులు ఆయా పాఠశాలలను గాలికి వదిలేయడంతో వారు రెచ్చిపోతున్నారు. జిల్లా విద్యశాఖలో వివాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


