26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ భవన్‌లో టిబీజీకేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

. . . సింగరేణి పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో బొగ్గుగని కార్మిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలోని సింగరేణి సంస్థ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వారు ఆరోపించారు. “ఒకప్పుడు సింగరేణి సిరుల గని అయితే, ఇప్పుడు మేడిపండులా అయిపోయింది. కాంగ్రెస్ పాలనలో సింగరేణి స్క్యామ్‌ల గనిగా మారింది” అని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో సింగరేణిలో 19 వేల ఉద్యోగాలు కల్పించి సంస్థకు జీవం పోశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల తొలగింపుల దిశగా సాగుతోందని ఆరోపించారు. “ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్‌ఎస్ పని అయితే, ఉన్న ఉద్యోగాలను తొలగించడం కాంగ్రెస్ పని” అని వ్యాఖ్యానించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయని పేర్కొంటూ, 2014లో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే డ్యూస్ ఉండగా, ఆ తర్వాత తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి రూ.7 వేల కోట్ల వరకు మాత్రమే బకాయిలు ఉన్నాయని చెప్పారు. అయితే కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ఈ డ్యూస్ రూ.21 వేల కోట్లకు పెరిగాయని ఆరోపించారు. కరెంట్ సరఫరా విషయంలో కూడా సింగరేణికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ రూ.3,200 కోట్లు మాత్రమే ఉండగా, సింగరేణి ఓడీ రూ.4 వేల కోట్లకు చేరిందని, ఒకప్పుడు ఫిక్స్‌ డ్ డిపాజిట్లు కలిగిన సంస్థ ఇప్పుడు ఓడీపై నడుస్తోందని విమర్శించారు. సింగరేణి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఆ బొగ్గుపై ఆదాయం వచ్చినట్లుగా ఆదాయపన్ను కూడా చెల్లించారని పేర్కొన్నారు. ఆ బొగ్గు విలువ సుమారు రూ.1,600 కోట్లుగా ఉంటుందని చెబుతూ, “ఆ బొగ్గు ఎక్కడ ఉందో ప్రజలకు చూపించాలి” అని డిమాండ్ చేశారు. అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో సింగరేణితో కలిసి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. పీపీఏ, డీపీఆర్ ఆమోదం లేకుండానే సివిల్ పనులు ప్రారంభించారని ఆరోపించారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల కోట్ల రూపాయల నష్టం వస్తోందని, కమిషన్ల కోసమే ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులు చేస్తున్నారని విమర్శించారు. సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించిన నాయకులు, సింగరేణి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని అన్నారు. “బంగారు బాతులాంటి సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారు” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ని ఉద్దేశించి, తెలంగాణలోని 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలపై ఆధారాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల్లో అవినీతి జరుగుతోందని బీఆర్‌ఎస్ లేవనెత్తిన అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేయాలని కోరారు.

 

TBGKS State Executive Committee Meeting at Telangana Bhavan

More articles

Latest article