29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్కార్ ఉద్యోగుల బదిలీలలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కుర్చీలు వదలకుండా ప్రయత్నాలు

 

. . . ఉద్యోగ సంఘాల లేఖలకు భలే డిమాండ్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మే మాసంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. కానీ కొందరు ఉద్యోగులు తమకు అచ్చి వచ్చిన కుర్చీని వదిలేందుకు సూతారం ఇష్టపడటం లేదు. జోన్, మల్టీ జోన్ పరిధి ఉద్యోగుల బదిలీల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ ద్వార కేవలం అటెండర్, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీ జరుగనుంది. సీనియర్ అసిస్టెంట్, సూపరింటేండేంట్, గెజిటేడ్ ఉద్యోగుల బదిలీ వ్యవహరం అంతా హైదరాబాద్ స్థాయిలో సీనియారిటీ ఆధారంగా జరుగనుంది. ప్రభుత్వం బదిలీ వ్యవహరంలో రిటైర్మెంట్ దగ్గర ఉన్నవారిని, స్పౌజ్ కేసులు, తీవ్రమైన వైద్యం అవసరమైన గుండే జబ్బులతో పాటు వికలాంగులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. కానీ కొందరు తమకు అచ్చి వచ్చిన స్థానాలను వదులకోలేక పైరవీలకు తెర లేపారు.. అందుకు సంఘాల లెటర్ లతో ప్రస్తుతం హైదరాబాద్ లో తిష్టవేసి పనులను చేసుకునే పనిలో పడ్డారు..

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఓ సీనియర్ అసిస్టెంట్ పది ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయాడు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కూడా ఇక్కడే తీసుకున్నాడు. వసూళ్లకు బాగా ఎగబడ్డాడు. ఉన్నతాధికారులకు నోటిలో నాలుకలా ఉంటూ  ఇక్కడి నుంచి కదలడం లేదు. మరో ముగ్గురు సైతం ఇక్కడి నుంచి పదేళ్ల పై బడి తిష్ట వేశారు.  విద్యాశాఖలో కొందరు ఉద్యోగులు జిల్లా కార్యాలయాన్ని కదలకుండా  వదలకుండా ఏళ్లుగా తిష్ట వేశారు. వివిధ పోస్టులకు ఇంచార్జీలుగా కొనసాగుతూ కుర్చీలు వదలడం లేదు. ఒక వేళ బదిలీపై వెళ్లిన డిప్యూటేషన్ లో మళ్లీ యదాస్థానానికి వచ్చేందుకు ముందస్ధు వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. కామారెడ్డి ఎస్సీ వెల్ఫేర్ శాఖలో ఇక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ పదేళ్లుగా ఒకే సీటులో కొనసాగుతున్నారు. గతంలో రెండుసార్లు బదిలీ అయినా  తనకున్న రాజకీయ పలుకుబడితో (పైరవీలు) తిరిగి అదే స్థానానికి వచ్చినట్లు తెలుస్తుంది. వ్యవసాయ శాఖలో ఆరుగురు ఉద్యోగుల బదీలీలలో ఐదుగురు ఉద్యోగులు 9 సంవత్సరాల నాలుగు నెలలుగా ఒకే స్థానంలో పనిచేస్తుండగా, మరొకరు ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు గా పనిచేస్తున్న అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ లో ఉమ్మడి జిల్లాలోనే కొందరు ముదుర్లు తమకు దండిగా ఆదాయం అర్జీంచి పెట్టే స్థానాలలోకి వచ్చేందుకు, అక్కడ ఉన్నవారు కదలకుండా ఉండుటకు పైరవీలు చేస్తుండటం గమనార్హం.

 

Government employee transfers

 

కామారెడ్డి,  నిజామాబాద్ ట్రెజరీ శాఖల్లో  కొందరు అధికారులు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. వీరికి ఇతర జిల్లాలకు బదిలీ అయినా సరే  ఇక్కడి నుంచి కదలడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని సమాచారం. కామారెడ్డి జిల్లాలోని ఒక సీనియర్ ఉద్యోగి జిల్లా ఏర్పడక ముందు నుంచే ఇక్కడ పనిచేస్తున్నారు. గతంలో ఈయనను వేరే డివిజన్‌కు బదిలీ చేసినప్పటికీ  డిప్యుటేషన్ పేరుతో మళ్లీ కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖకే వచ్చి చేరారు. నిజామాబాద్ జిల్లాలోని ఒక ఏఈఓ సైతం జిల్లా కార్యాలయంలో తొమ్మిదేళ్ళ పైబడి పాతుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ యూనియన్ లెటర్ పెట్టుకొని  హైదరాబాద్ వెళ్ళి ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ లో హంగామా చేశాడు. అర్హురాలు అయిన మహిళ ఉద్యోగినికి నష్టం చేసే ఎత్తుగడలు వేశారు. దీంతో డైరెక్టర్ సదరు యూనియన్ పెద్దలు  ఈ ఉద్యోగికి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించాడు. యూనియన్ పెద్దగా పేరు చెప్పుకుంటూ  ఉద్యోగం మానేసి  హైదరాబాద్ చుట్టూ తిరిగితే క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్  కామారెడ్డి జిల్లాల కలెక్టర్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారుల వద్ద గత ఎనిమిదేళ్లుగా సీసీలు  సహాయకులుగా కొనసాగుతున్నారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో పాటు  యూనియన్ లెటర్స్ తో బదిలీ లేకుండా చూసుకుంటూ  వీరు తమ స్థానాలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చుట్టూ కొత్త వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా యూనియన్ లేఖల పేరుతో జిల్లాలో జరుగుతున్న పైరవీలు  అక్రమ వసూళ్లు,  కృత్రిమ పదవుల సృష్టి వంటి అంశాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సంఘం  పేరుతో ఏర్పడిన కొన్ని నాయకత్వాలు ఉద్యోగుల బదిలీల భయాన్ని అవకాశంగా మార్చుకొని భారీగా డబ్బులు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల జరుగుతున్న ఉద్యోగ సంఘాల్లోని అంతర్గత అసంతృప్తి,  ఉద్యోగుల ఆరోపణలన్ని కలిపి చూస్తే  రాష్ట్ర వ్యాప్తంగా ఒక  యూనియన్ లెటర్ మాఫియా  రూపుదిద్దుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా జోనల్,  మల్టీ జోనల్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులపై ఒత్తిడి పెంచి మా లేఖ ఉంటేనే మీకు అనుకూల పోస్టింగ్ వస్తుంది  అంటూ కొన్ని సంఘాల పెద్దలు డబ్బుల వేట సాగిస్తున్నట్లు సమాచారం.

బదిలీల భయం……

ప్రస్తుతం అటెండర్లు  జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు జిల్లా పరిధిలోనే బదిలీలు జరుగుతుండగా  సీనియర్ అసిస్టెంట్ నుంచి పై స్థాయి అధికారులకు జోనల్  మల్టీ జోనల్ పరిధిలో బదిలీలు అమల్లో ఉన్నాయి. బాసర జోన్-2 పరిధిలో నిజామాబాద్ జిల్లా ఉండగా  మల్టీ జోన్-1 పరిధిలో కూడా ఈ జిల్లా వస్తోంది. దీంతో  స్వంత జిల్లా విడిచి వెళ్లాల్సి వస్తుందేమో  అన్న భయం అనేక మంది ఉద్యోగుల్లో నెలకొంది. ఈ పరిస్థితిని కొందరు యూనియన్ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మా సిఫార్సు లేఖ ఉంటేనే జిల్లా లోపల పోస్టింగ్  మంత్రి వర్గం వరకు మా పరిచయాలు ఉన్నాయి  సీఎం కార్యాలయం వరకు మా మాట పనిచేస్తుంది  అంటూ ఉద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

ఒక్కో లేఖకు లక్షల వసూళ్లు…..

ఉద్యోగుల వర్గాల్లో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం ఒక్కో యూనియన్ లేఖకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగి పోస్టు పని చేసే విభాగం  బదిలీ కావాల్సిన ప్రాంతం ఆధారంగా  రేట్లు  నిర్ణయిస్తున్నారన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు  అనారోగ్యం,  పిల్లల చదువులు,  భార్యాభర్తల ఉద్యోగాలు వంటి సెంటిమెంట్ అంశాలను చూపించి ఉద్యోగులు బదిలీ నిలిపివేయాలని కోరితే దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కొంతమంది నాయకులు బైలాలో లేని పదవులను కూడా సృష్టించి  రాష్ట్ర కోఆర్డినేటర్,  జోన్ ఇన్‌చార్జ్,  చీఫ్ అడ్వైజర్  ట్రాన్స్‌ ఫర్ కమిటీ కన్వీనర్   డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్  ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ వంటి పేర్లతో కొత్త పోస్టులు కల్పించి వాటి ద్వారా ప్రభావం చూపుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పదవుల పేరుతోనే వసూళ్లు జరుపుతూ సంఘాలను వ్యక్తిగత వ్యాపారాలుగా మార్చేశారన్న అసంతృప్తి పెరుగుతోంది.

సభ్యుల నుంచే తిరుగుబాటు…..

ఈ వ్యవహారాలపై ఇప్పుడు స్వంత సంఘాల సభ్యులే బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.  సభ్యత్వ ఫీజులు తీసుకుని  మళ్లీ లేఖల పేరుతో డబ్బులు అడుగుతున్నారు. సంఘం నాయకులు ఉద్యోగుల సమస్యల కంటే సెటిల్‌మెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.  అంటూ పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.

జిల్లాలో ఇప్పటికే సంఘాల సభ్యత్వాలను వదులుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు కొత్త సంఘాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగుల కోసం కాదు  వ్యక్తిగత ఆస్తుల కోసం సంఘాలు నడుస్తున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

కౌన్సిలింగ్లో యూనియన్ ప్రభావం…..

ఇటీవల నిర్వహించిన బదిలీ కౌన్సిలింగ్ కేంద్రాల వద్ద కూడా యూనియన్ ప్రతినిధుల హడావుడి అధికమైందని ఉద్యోగులు చెబుతున్నారు. కొందరు నాయకులు అధికారుల వద్దకు నేరుగా వెళ్లి  మన వాళ్ల జాబితాలు అందజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారిక విధానాల కంటే సిఫార్సులే కీలకంగా మారుతున్నాయన్న భావన ఉద్యోగుల్లో పెరుగుతోంది. హైదరాబాద్ కేంద్రంలో జరిగిన వ్యవసాయ ఉద్యోగుల ట్రాన్స్ ఫర్ గొడవలే దీనికి ఉదాహరణ.

కొందరి వల్లనే అక్రమాలు….

అయితే అన్ని సంఘాలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పలేమని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది నిజాయితీ నాయకులు మాత్రం ఈ అక్రమాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది మంది కారణంగా మొత్తం ఉద్యోగ సంఘాల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని వారు అంటున్నారు.

ప్రభుత్వ జోక్యం చేసుకొని….

బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘాలపై విజిలెన్స్  ఏసీబీ లేదా విభాగీయ విచారణ జరపాలన్న డిమాండ్ పెరుగుతోంది. అలాగే బైలాకు విరుద్ధంగా కృత్రిమ పదవులు సృష్టిస్తున్న సంఘాల గుర్తింపును రద్దు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Government employee transfers

More articles

Latest article