. . . సగానికి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది
. . . చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన
. . . రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు
సిద్దిపేట్, బతుకమ్మ :
ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిసి నష్టపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, రైతుల తరఫున పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వడ్లు, మక్కలు, సన్‌ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనుగోలు విషయంలో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై నెపం మోపుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రాష్ట్రంలో ధర్నాలు చేయడం రాజకీయ నాటకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ లెవీ కోటా, ఎరువుల కోటాలను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువులు, వడ్ల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలతో రైతులు బంగారం లాంటి పంటలు పండించారని, ఇప్పుడు వాటిని కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ ఈసారి ఆన్‌లైన్ ట్యాగింగ్, కొత్త నిబంధనల పేరుతో ప్రభుత్వం నెలరోజుల పాటు ఆలస్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కూర్చొని 80 శాతం వడ్లు కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఇంకా సగానికి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహసీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో సమావేశాలు నిర్వహించి తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు ఉంటేనే ధాన్యం దింపుకుంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్‌గా నమోదు చేసి రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. క్వింటాల్‌కు 3 నుంచి 5 కిలోల తరుగు పేరుతో కూడా రైతులపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. రవాణా, హమాలీ, ట్రాక్టర్ వెయిటింగ్, కాంటా ఛార్జీలు అన్నీ రైతులపైనే మోపుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. తొలుత 90 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం కావడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా, కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే కేటాయించిందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ధర్నాలు చేయడం కంటే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా పోరాడాలని సూచించారు. సన్‌ఫ్లవర్, జొన్నలు, శనగలు కొనుగోలు విషయంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలిచిందని, ప్రస్తుతం మాత్రం రెండు నెలలుగా సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

వానాకాలం సమీపిస్తున్నప్పటికీ జీలుగ, జనుము విత్తనాలు, ఎరువుల నిల్వలను ప్రభుత్వం సిద్ధం చేయలేదని ఆరోపించారు. రైతులు, వ్యవసాయం ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ పెంచి అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్‌ను తగ్గించి చిత్తశుద్ధి నిరూపించుకోవా లని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో లారీ డ్రైవర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున వారం రోజుల పాటు ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపివేసి ఇసుక లారీలను వడ్ల రవాణాకు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం ఇసుక ఆదాయానికే ప్రాధాన్యత ఇస్తుందా, రైతులకా అనే విషయం తేల్చుకోవాలని ప్రశ్నించారు.

