నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
క్షయ రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా నిర్వహించిన టీబీఎంబీఏ 2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డా. రాజశ్రీ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ) డా. దేవి నాగేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా 28వ వార్డు కార్పొరేటర్ మల్కాయి మహేందర్ నిక్షయ్ మిత్రగా క్షయవ్యాధి రోగులకు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, డీఎంహెచ్‌ఓ డా. రాజశ్రీ, డీటీసీఓ డా. దేవి నాగేశ్వరి, ఎస్‌ఆర్ నగర్ యూపీహెచ్‌సీ సిబ్బంది కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రజలకు వారి వార్డులోనే ఛాతీ ఎక్స్-రే, ఇతర ఉచిత వైద్య పరీక్షలు వంటి అవసరమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజారోగ్య పరిరక్షణకు విశేషంగా కృషి చేసినందుకు కార్పొరేటర్ మల్కాయి మహేందర్‌కు అధికారులు అభినందనలు తెలిపారు. అలాగే, నిక్షయ్ మిత్రగా క్షయవ్యాధి రోగులకు పోషకాహార సహాయంగా నాలుగు ఫుడ్ కిట్లను కార్పొరేటర్ మల్కాయి మహేందర్ అందజేశారు. అనంతరం కార్పొరేటర్ డీఎంహెచ్‌ఓ డా.రాజశ్రీ, డీటీసీఓ డా. దేవి నాగేశ్వరిలను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది, ఎస్‌ఆర్ నగర్ యూపీహెచ్‌సీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
