. ఏడుగురు సిబ్బంది బదిలీ
. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పనిచేసే టాస్క్ ఫోర్స్ మొత్తం ఖాళీ అయ్యింది. అవినీతి అక్రమాలను సహించని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తన ఆధీనంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ పై అవినీతి ఆరోపణల వస్తున్న నేపథ్యంలో ప్రక్షాళనకు దిగారు. కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా టాస్క్ ఫోర్స్ లో మొత్తం సిబ్బందిని మార్చిన రికార్డులు లేవు. మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్న విష్ణుమూర్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి బదిలీ చేసిన శాఖ సిబ్బందిలో టాస్క్ ఫోర్స్ కు చెందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీపీ టాస్క్ ఫోర్స్ పై కన్నెర్ర చేసినట్లు సమాచారం. మొదట ఏసీపీని అందుకు బాధ్యుడిని చేస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసి చర్యలు తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఏసీపీ తో కలిసి వసూళ్లకు అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు సుధాకర్, రాములును సస్పెండ్ చేశారు. మిగతా ఏడుగురు సిబ్బందిని బదిలీ చేశారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ లో ఇద్దరు సీఐలు ఉండగా పురుషోత్తంను ఆర్మూర్ సీఐగా నియమించారు. మరో సీఐ అంజయ్య ఇదివరకే సిక్ లీవ్ పై వెళ్లడంతో కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ మొత్తం ఖాళీ అయ్యింది. టాస్క్ ఫోర్స్ లో ఇన్ చార్జి ఏసీపీగా సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఒక్కరే పని చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ విభాగంలో ఎవరినీ కొత్తగా నియమించలేదు. టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది నియామకంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.
