- జీజీహెచ్ లో చేతివాటం ప్రదర్శించిందేవరు?
- కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో వెలుగులోకి
- తన హయంలో జరుగలేదని డీఎంఈకి ఇంచార్జి అధికారి లేఖ
- విచారణ చేపట్టిన డిఎంఈ

నిజామాబాద్, బతుకమ్మ : కరోనా కాలంలో గాంధీ, ఉస్మానియా తర్వాత అత్యధిక మంది వైరస్ పీడితులకు వైద్యం అందించిన ఆసుపత్రిగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి పేరు గడించింది. వందల మందికి అహర్నిశలు వైద్య సేవలందించి వేల మంది ప్రాణాలను కాపాడిన ఘనతను దక్కించుకుంది. అయితే ఆనాడు వైద్య సేవల విషయంలో ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రజల మనన్నలు అందుకున్న ఆసుపత్రిలో రెమిడిసివేర్ పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన విచారణ అటకెక్కింది. ఔట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ పై వేటు వేసి చేతులు దులుపుకున్నారు ఆనాటి అధికారులు. కానీ దానిపై కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే వారిపై కేసులు నమోదు చేయించి భయబ్రాంతులకు గురి చేసిన ఉదంతం ఉంది. అయితే ఆనాడు కేవలం కరోనాను నిరోధించడానికి వాడే మందు అయిన రెమిడెసివేర్ తో పాటు కీలకమైన అత్యాధునిక వెంటిలెటర్లు మాయమయ్యాయి. ఈ విషయం ఆనాడు జీజీహెచ్ కు ఉచితంగా అందజేసిన సంస్థ వాటి పనితీరును పరిశీలించడానికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 30కి పైగా వెంటిలెటర్లు ఉండగా హై టెక్నాలజి కలిగిన సామాగ్రి మాయం కావడంతో దాని విలువనే బహిరంగ మార్కెట్లో రూ.3 కోట్లు ఉంటుందని తెలిసింది.
గడిచిన నెలలో బెంగళూర్ కు చెందిన ప్రముఖ కంపెనీ జీజీహెచ్ లో కరోనా కాలంలో ఇచ్చిన అత్యాధునిక వెంటిలెటర్ల పని తీరును పరిశీలనకు వచ్చింది. అయితే ఆనాడు జీజీహెచ్ లో 66 వెంటిలెటర్లు ఉండగా సదరు పరిశీలన బాధ్యతను తీసుకున్న సంస్థ తనిఖీలకు వచ్చే సరికి 32 వరకు కనిపించలేదు. ఈ విషయంలో సదరు సంస్థ డిఎంఈతో పాటు నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు నోటీసులు ఇచ్చింది. దానితో అప్పటికప్పుడు జీజీహెచ్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ఆనాడు పని చేసిన ప్రొఫెసర్ లతో కలిసి ఆసుపత్రిలో ఏయే సామాగ్రి ఉందనే విషయాన్ని లెక్కల ప్రకారం వెలికి తీశారు. అయితే ఆక్సిజన్ కాన్ స్ట్రేటర్లు ఉండగా వెంటిలెటర్లు మాత్రం మాయం అయినట్లు గుర్తించారు. ఈ విషయం ఆక్సిజన్ వెంటిలెటర్లు తాను సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకునేటప్పటికే మాయం అయ్యాయని ఈ విషయంలో తన ప్రమేయం లేదని డీఎంఈకి ఇంచార్జి సూపరింటెండెంట్ లేఖ రాయడం గమనార్హం.
నిజామాబాద్ జీజీహెచ్ లో కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక వెంటిలెటర్లు మాయం అంతా గత పాలకుల హయంలో జరిగిందనే విషయం ప్రస్తుత సూపరింటెండెంట్ లేఖతో తేటతెల్లం అయింది. అయితే గతంలో కరోనా సమయంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కాన్ స్ట్రేటర్లు లేకపోయినా, వెంటిలెటర్లు లేకపోయినా వైద్య సేవలు చేసిన విషయం తెల్సిందే. ఆనాడు రెమిడెసివేర్ తో పాటు అత్యాధునిక సామాగ్రిని కూడా తరలించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జీజీహెచ్ లో ఉండాల్సిన వెంటిలెటర్లు మాయం వెనుక ఒక ప్రైవేట్ వైద్య విద్యా సంస్థ ప్రమేయం ఉందన్న వాదనలున్నాయి. సదరు విద్యా సంస్థ తన కళాశాలకు కొత్త విభాగం ఏర్పాటుకు వైద్య మండలి తనిఖీకి వచ్చే సమయంలో జీజీహెచ్ నుంచి వెంటిలెటర్లు తరలించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ విషయంలో తర్వాత అధికారులు ఒత్తిడి చేయించినా సామాగ్రిని తిరిగి ఇవ్వలేదన్న వాదనలున్నాయి. గతంలో జిల్లా ఆసుపత్రి ఒక వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. వైద్య సేవల విషయంలో ఎంత పేరు గడించిందో వివాదాల్లోనూ అంతే మునిగి తేలిందని చెప్పాలి. ప్రస్తుతం డీఎంఈ వెంటిలెటర్ల మాయంపై విచారణ చేస్తుండడంతో విచారణ అనంతరం ఈ వ్యవహరం బాధ్యులపై చర్యలు ఉంటాయా? గతంలో మాదిరిగానే విచారణను అటకెక్కిస్తారా అనేది తేలనుంది.