. నగరంలో కుక్కల బెడద నివారణకు కృషి
. ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
. ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వీధి కుక్కల నియంత్రణపై నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ఏబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)లో ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించడంపై కమిషనర్ దిలీప్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతి రోజూ రాత్రిపూట పది మంది బృందాలుగా ఏర్పడి ఆయా డివిజన్ లలో కుక్కలను పట్టి ఏబీసీ సెంటర్ కు తరలిస్తున్నారు. ఒక్కో కుక్కను పట్టుకునేందుకు రూ.1650 చొప్పున నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానించింది. నగరంలో సుమారు 2411 వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా కాగా, ఇప్పటి వరకు 841 కుక్కలను పట్టుకున్నట్లు శానిటరీ ఇన్ స్పెక్టర్ సల్మాన్ రాజ్ తెలిపారు. 441 కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఏబీసీ సెంటర్ కు తరలించామన్నారు. నగరంలో ఎక్కడైనా కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 08462 220234 నంబర్ కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇప్పటివరకు కేవలం రాత్రి వేళలోనే కుక్కల పట్టే ప్రక్రియను చేపట్టగా, కమిషనర్ ఆదేశాల మేరకు ఇక నుంచి ఉదయం వేళలో కూడ కుక్కల పట్టుకోనున్నారు.
కొన్ని ప్రాంతాల్లో భిన్న పరిస్థితి
నగరంలోని చాలా ప్రాంతాల్లో కుక్కలను నియంత్రించాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మైనారిటీ ప్రాంతాల్లో కుక్కలను పట్టుకునేందుకు వెళ్తే తమ సిబందిపై దాడికి దిగుతున్నారని మున్సిపల్ అధికారులు అంటున్నారు. ఇటీవల 55వ డివిజన్ లో కుక్కలు పట్టుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిని కాలనీవాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక కార్పొరేటర్ కలగజేసుకొని వారికి నచ్చ చెప్పారని తెలిపారు.
ఏబీసీ సెంటర్ లో ఇలా..
ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్ ను ఓ ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీనికిగాను లేబర్లు, సంబంధించిన వెహికల్ కాంట్రాక్ట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏబీసీ సెంటర్ సిబ్బంది ప్రతిరోజూ ఆయా ప్రాంతాలకు వెళ్లి కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో బంధించి ఏబీసీ కి తరలించాలి. అక్కడి డాక్టర్ పర్యవేక్షణలో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన అనంతరం వాటిని నాలుగు రోజులపాటు వారి పర్యవేక్షణలో ఉంచుతారు. తిరిగి వాటిని ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే వదిలేస్తారు.
వైర్లతో బంధించడంపై విమర్శలు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుక్కల నియంత్రణకు అన్ని విధాలా కృషి చేస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వైర్లతో కుక్కలను బంధించడంపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫొటోలో, వీడియోలు సైతం వైరలయ్యాయి. దీనిపై అప్పటి కమిషనర్ ను సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్) వివరణ కోరింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని పాత పద్ధతిలోనే కుక్కలను బంధిస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
