- హాజరైన డీఈవో, ఏడి
- 22 మంది ఎస్ వోలు కూడా
హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్,వరంగల్ జిల్లాలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ పై సర్వశిక్షా అభియాన్ లో విచారణ ప్రారంభమైంది. ప్రధానంగా రెండు జిల్లాల్లో 2025-26 విద్యా సంవత్సరాల్లో కేజీబీవీల కోసం టీఎల్ఎంలను కొనుగోలు చేశారు. సాధారణంగా 2.5 లక్షల పైచిలుకు కొనుగోళ్ళను టెండర్ల ద్వారా నిర్వహించడం ఆనవాయితీ. అయితే నిజామాబాద్, వరంగల్ జిల్లాలో సంబంధిత విద్యాశాఖాధికారులు, జీఈసీవోల ఆదేశాల మేరకు కేజీబీవీల ఎస్ వోలు ప్రైవేట్ ఏజెన్సీకి నిధులను బదిలీ చేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 27 కేజీబీవీల నుంచి 33 లక్షలను ఏజెన్సీకి ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఈ ఒప్పందం తర్వాత సర్వశిక్షా అభియన్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీలకు టీఎల్ఎంలను సరఫరా చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే నిజామాబాద్, వరంగల్ జిల్లాలో కేజీబీవీలలో ఉన్న మిగులు నిధులను ప్రైవేట్ ఏజెన్సీకి ధారదత్తం చేసిన అధికారులు వాటిని వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత డబ్బులు సదరు ఏజెన్సీ నిర్వాహకులకు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది. దానిపై సర్వశిక్ష అభియాన్ అధికారులు విచారణకు ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టీఎల్ఎంల కొనుగోళ్ళకు 27 కేజీబీవీల నుంచి విద్యాశాఖాధికారుల ఆదేశాల మేరకు 33 లక్షలను ప్రైవేట్ ఏజెన్సీకి నిధులను మళ్ళించారు. కేవలం డిఈవో, జీఈసీవో, అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు నిధులు మళ్ళించామని కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు వెల్లడించారు. ఈ విషయంపై సర్వశిక్ష అభియాన్ అధికారులు విచారణలోనూ ఎస్ వోలు ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారుల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏజెన్సీకి కేజీబీవీల మిగులు నిధులు బదిలీపై వివాదం చెలరేగింది. ప్రధానంగా జిల్లా కలెక్టరే సర్వశిక్ష అభియాన్ కు చైర్మన్ గా వ్యవహరించే సంస్థ ద్వారా జరిగిన కొనుగోళ్ళ వ్యవహరం అధికారుల తప్పిదాలను ఎత్తిచూపింది. ఈ విషయంలో సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ నుంచి ఇటీవల జిల్లా అధికారులకు తాఖీదులు అందాయి. అందులో భాగంగా మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఏడి జిల్లాలోని 22 కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు ఎస్పీడీ ఎదుట హాజరయ్యారు. అందులో అందరూ కూడా తాము అధికారుల ఆదేశాలను అమలు చేశామని అంతకు మించి తమకేమి తెలియదని ఎస్ వోలు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహరంలో డీఈవోతో పాటు జీఈసీవో పై అధికారులు చర్యలు తీసుకుంటారని, అదే విధంగాఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ గా ఉన్న అప్పటి ఏసీ పై శాఖపరంగా విచారణ జరుగుతుందన్న వాదనలున్నాయి. అధికారులు మంగళవారం జరిగిన విచారణ వివరాలను వెల్లడించనప్పటికీ ఈ వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
