నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ :
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో ఫీడే రేటెడ్ చెస్ క్రీడాకారుడు, కోచ్ మనోజ్ కుమార్ విట్టాపు చేత ఏకకాలంలో 10 మంది క్రీడాకారులతో ప్రత్యేక చెస్ కార్యక్రమాన్ని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ ఏకకాలంలో పదిమంది క్రీడాకారులతో చెస్ ఆడి తన ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో ఫీడే రేటెడ్ క్రీడాకారుడు మనోజ్ కుమార్ పై నవ్యభారతి గ్లోబల్ పాఠశాల క్రీడాకారుడు జై (7వ తరగతి) విజయం సాధించడం విశేషం. మనోజ్ కుమార్ అనంతరం క్రీడాకారులకు చెస్ లోని మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని చెస్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఫీడ్ రేటెడ్ చెస్ క్రీడాకారుడు, కోచ్ మనోజ్ కుమార్‌ను ప్రత్యేకంగా నిజామాబాద్‌కు ఆహ్వానించామని తెలిపారు. విద్యార్థులు ప్రత్యక్షంగా ఉన్నత స్థాయి క్రీడాకారుడి ఆటను వీక్షించడం ద్వారా కొత్త వ్యూహాలను నేర్చుకునే అవకాశం లభిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల కృషి చేస్తోందని అన్నారు. ఫీడే రేటెడ్ చెస్ క్రీడాకారుడు, కోచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, చెస్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, ఆలోచనా శక్తి, ఏకాగ్రత, ఓర్పు, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించే గొప్ప మేధో క్రీడ అని అన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణతో సాధన చేస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు క్రీడాకారులకు నిర్వహించడం వారిలోనే నైపుణ్యతను వెలికి తీయడమే అని అలాంటి కార్యక్రమాన్ని నవ్యభారతి గ్లోబల్ పాఠశాల యాజమాన్యం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సరిత, సుధీర్, వేమా, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

