నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ముఠా టార్గెట్
వెస్ట్ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో అమ్మకాలు
వెబ్ న్యూస్, బతుకమ్మ: చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులు రక్షించి, శిశు విహార్ కు తరలించారు. ఈముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టినట్లు విచారణలో తేలింది. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ముంబై, యూపీలోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం చిన్నారులను తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు. ఈముఠాలో ప్రధానంగా ఆస్పత్రుల్లో పని చేసే వ్యక్తులే ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పని చేస్తున్న కార్తిక్, అజంపుర యూపీహెచ్సీలో ఆశావర్కర్ అమూల్య, మల్కపేట ఏరియా ఆస్పత్రి సూపర్ వైజర్ ఇస్మాయిల్ ఉన్నాయి. ఇప్పటివరకు 27 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 14 మంది చిన్నారులను రక్షించారు. ముఠా ద్వారా ఇప్పటివరకు 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించారు. ఇంకా 11 మంది చిన్నారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈముఠా మగశిశువులు రూ. 4లక్షలకు కొనుగోలు చేసి రూ. 6లక్షలకు విక్రయిస్తుండగా, ఆడశిశువులను రూ. 3లక్షలకు కొనుగోలు చేసి రూ. 4లక్షలకు విక్రయిస్తున్నారు. ఈకేసులో ఈడీ రంగ ప్రవేశం చేయడంతో నిందితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
