ఏర్గట్ల, బతుకమ్మ :
జీవితంలో ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసం ఉండాలని, అది ఉన్ననాడు ఏ రంగంలోనైనా ఉన్నత విజయాలు సాధిస్తారని, ముఖ్యంగా విద్యార్థులు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ఏర్గట్ల మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి తెలుగు, హిందీ ప్రతిభ పరీక్షకు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు. ఇలాంటి పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మండల తెలుగు ఉపాధ్యాయులను, హిందీ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా ఉన్నటు వంటి ఏర్గట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మను, గంగాధర్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీ పరీక్షలలో మండల స్థాయిలో తెలుగు విభాగంలో మొదటి స్థానం జక్కని వైష్ణవి, జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల, రెండవ స్థానం జక్కుల చందన, కేజీబీవీ బాలికల పాఠశాల ఏర్గట్ల కైవసం చేసుకోగా, హిందీ విభాగంలో మొదటి స్థానం సందీప్ జెడ్పిహెచ్ఎస్ ఏర్గట్ల, రెండవ స్థానం అక్షర, జెడ్పిహెచ్ఎస్ గుమ్మిర్యాలు కైవసం చేసుకున్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తపస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మగ్గిడి ప్రవీణ్, మమత, రాజన్న సమత, తదితరులు పాల్గొన్నారు.