బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ : చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను విద్యార్థినీలు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఆరేటి రాంప్రసాద్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల తోపాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అట్టడుగు వర్గాల మహిళల చదువులకు సంపద వంటి సమస్త హక్కులకోసం, దేశంలో అప్పటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా 1848లో లో మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించారని తెలిపారు, స్త్రీలకు విద్య అందించడానికి ఉపాధ్యాయురాలిగా వెళ్తున్న సమయంలో అనేక అవమానాలు ఎదురైనా కూడా పట్టించుకోకుండా స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిందని, అంటరానితనం,కుల నిర్మూలన, కోసం పోరాడిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండలంలోని వదలపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్కులు పెన్నులు పెన్సిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
