29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. దోమల నివారణ చర్యలు శూన్యం..

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల బెడదతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

బాన్సువాడ , బతుకమ్మ  : బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల బెడదతో ప్రజలు వేగలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ముసురుతున్న దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడదను తట్టుకునేందుకు ప్రజలు మస్కిటో కాయిల్స్, అగర్‌ వత్తులు వినియోగించాల్సి వస్తోంది. చీకటి పడితే చాలు దోమల బెడద భరించలేక పోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు మున్సిపాలిటీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.సాధారణంగా సంధ్య సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచుతారు. కానీ బాన్సువాడలో దోమల బెడద వల్ల తలుపులు మూసి ఉంచే పరిస్థితి నెలకొన్నది. రాత్రివేళ బయట కూర్చోవాలంటే దోమలతో ఇబ్బందిగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. చిరు వ్యాపారులు దోమల బెడదతో టేబుల్ ఫ్యాన్లు పెట్టుకొని మరి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వేకువజామున పాలు పితకాలన్నా ఫ్యాన్ పెట్టుకోవాల్సి వస్తుందని పలువురు పేర్కొన్నారు. గత 20 రోజులుగా దోమల సమస్య మరింత పెరిగిందని చెబుతున్నారు.

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులున్నాయి. పారిశుధ్య నిర్వహణ కోసం 50 మంది పైగా కార్మికులున్నారు. కానీ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించక డ్రైనేజీలు దోమలకు నిలయంగా మారాయి. మరో వైపు వ్యర్థాలు నిండిపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. ఈ పరిస్థితి దోమల వృద్ధి కి అనుకూలంగా మారింది. బాన్సువాడ పట్టణంలో తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలు కంపు కొడుతుండగా, దోమల బెడద రోజురోజుకు పెరుగుతోంది.

దోమల నివారణ చర్యలు శూన్యం..

బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల నివారణ చర్యలు కానరావడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ యంత్రాలున్నా వినియోగించడం లేదని విమర్శలు ఉన్నాయి. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో దోమల బెడద పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దోమల నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా బాన్సువాడ మున్సిపల్ అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని బాన్సువాడ ప్రజలు కోరుతున్నారు.

Sanitation is a mess.. Mosquito prevention measures are null..

More articles

Latest article