- మొదటగా రూ. 50 వేలు, రూ. లక్ష లోపు కేటగిరీల వారికి అందజేత
- లబ్ధిదారులు యూనిట్లు స్థాపించి ఆర్ధిక పురోగతి సాధించేలా పర్యవేక్షణ
- కలెక్టర్లతో వీ.సీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
నిజామాబాద్, బతుకమ్మ : యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న మంజూరీ పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలను కలుపుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి 1623764 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక చేసిన లబ్దిదారులకు జూన్ 02 వ తేదీ నుండి మంజూరీ పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. జూన్ మాసంలో రూ. 50 వేలు, రూ. లక్ష లోపు సబ్సిడీ రుణ కేటగిరీలలోని సుమారు 85 వేల మంది లబ్దిదారులకు మొదటగా మంజూరీలు తెలుపడం జరుగుతుందని అన్నారు. అన్ని జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంజారీ ప్రత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. మంజూరీలు తెలుపబడిన లబ్దిదారులకు జూన్ 10 నుండి 15వ తేదీ వరకు యూనిట్ల స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్, తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. జూన్ 16 నుండి 20 వ తేదీ వరకు సబ్సిడీ మొత్తాలను విడుదల చేస్తారని, 21 నుండి 30 వ తేదీ వరకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ షెడ్యూల్ ను అనుసరిస్తూ జులై మాసంలో లక్ష నుండి రెండు లక్షల రూపాయల లోపు కేటగిరీకి చెందిన సుమారు లక్ష మంది లబ్దిదారులకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో రెండు లక్షల నుండి 4 లక్షల కేటగిరీకి చెందిన మరో మూడు లక్షల పైచిలుకు మంది లబ్దిదారులకు మంజూరీలు తెలుపడం జరుగుతుందని వివరించారు. ఐదు విడతలలో ఐదు లక్షల మంది లబ్దిదారులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 6260 కోట్ల రూపాయలను, బ్యాంకు లింకేజీ కింద 1667 కోట్ల రూపాయలను కలుపుకుని సుమారు 8 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా యూనిట్లను స్థాపించుకుని ఆర్ధిక పురోగతి సాధించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. మంజూరు చేసిన యూనిట్ల స్థాపన అనంతరం వాటి పనితీరు, నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు జిల్లాలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. మే 29, 30 తేదీలలో జరిగే ఇంచార్జి మంత్రుల సమావేశాలలో రాజీవ్ యువ వికాసం పై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసే లబ్దిదారులకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత యూనిట్ గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వం వెచ్చించే నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని, ఒక ప్రాంతంలో ఒకే తరహా యూనిట్లు ఎక్కువ సంఖ్యలో స్థాపించినట్లైతే లబ్ధిదారుల మధ్య పోటీ విపరీతంగా నెలకొనే అవకాశం ఉన్నందున వేర్వేరు యూనిట్లు నెలకొల్పేలా చూడాలన్నారు. ఇటుకల తయారీ, సెంట్రింగ్ వంటి వాటికి ముందుకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక చౌహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

