28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రైవేట్ స్కూళ్లలో ఆర్టీఈ అమలు చేయలేం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని, ఇక ముందు తాము రైట్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) అమలు చేయలేమని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్ లకు అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు.

ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ట్రస్మా స్పష్టం చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లు ఉచిత విద్యను అందించే స్థితిలో లేవని, ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని, ఆ డబ్బుతో వారు ఇష్టమైన స్కూళ్లలో పిల్లలను చేర్పించుకోవచ్చని ట్రస్మా ప్రతినిధులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.  అలాగే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని, స్కూళ్లను వాటి సదుపాయాల ఆధారంగా ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విభజన ఫీజు నిర్ణయంలో పారదర్శకతను, స్కూళ్ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.

తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లు-2025 లో ప్రతిపాదించిన ఫీజు నియంత్రణ, ఆర్టీఈ అమలు పర్యవేక్షణకు సంబంధించిన చర్చల నేపథ్యంలో ట్రస్మా తన డిమాండ్ లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ బిల్లు ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం సీట్ల రిజర్వేషన్‌ను పర్యవేక్షించాలని, ఫీజు పెంపును కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తో అనుసంధానించాలని సూచించింది.

 బిల్లుపై అభ్యంతరాలు

తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లు-2025పై ట్రస్మా పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పేరెంట్-టీచర్ కమిటీకి బదులు స్కూల్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, కేటగిరీల విభజనలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. కాగా తెలంగాణలో ఆర్టీఈ చట్టం ప్రకారం 25శాతం  సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలనే నిబంధన ఉండగా.. ఇప్పటికే దీనికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది.

More articles

Latest article