25.5 C
Hyderabad

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల దందా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరుగురు రూమ్ దళారీల అరెస్ట్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భక్తులకు కేటాయించే వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇరు విభాగాల సిబ్బంది సమన్వయంతో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో ఆగస్టు 8న ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోల ద్వారా గదులను పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. టీటీడీ నిర్ణయించిన ధరలకు భక్తులకు కేటాయించే గదులను అక్రమంగా పొంది, వాటిని అధిక ధరలకు విక్రయించడం ద్వారా భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో గదుల పేరుతో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులకు సూచించారు. టీటీడీ అధికారిక మార్గాల్లోనే వసతి గదులను బుక్ చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు అధిక ధరలకు గదులు ఇప్పిస్తామని చెబితే వెంటనే పోలీసులకు లేదా విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. రూమ్ దళారుల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు తిరుమలలో ప్రత్యేక నిఘా, తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని అధికారులు తెలిపారు.

More articles

Latest article