. . . తండ్రి అరెస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
కొడుకు వేధింపులు తాళలేక నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కపేట గ్రామానికి చెందిన గుడిపేట రాఘవులు అలియాస్ రాఘవరెడ్డికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గుడిపేట రాజేందర్ ఎలాంటి పని చేయకుండా తండ్రిని వేధించడంతో పాటు కొట్టడం, అప్పులు చెల్లించకుండా కుటుంబంలో తరచూ గొడవలు చేయడం చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 8న మధ్యాహ్నం ఫ్యాన్ విషయంలో రాజేందర్ తన తండ్రితో గొడవపడి అతడిపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా విసిగిపోయిన రాఘవరెడ్డి.. తన కుమారుడి వల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య నిద్రిస్తున్న రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తల, ముఖంపై గొడ్డలితో నరకడంతో రాజేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజేందర్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గుడిపేట రాఘవులు అలియాస్ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసిన కోనరావుపేట ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి, స్టేషన్ సిబ్బందిని సీఐ కె. రవీందర్ ఈ సందర్భంగా అభినందించారు.
