నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 6న నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీనివాస కిరాణా షాప్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో టౌన్-I పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా, అనుమానితులను పట్టుకొని విచారించారు. విచారణలో భాగంగా కోటగిరి మండలం జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ తను చేసిన నేరాన్ని అంగికరించాడు. అతను కేటరింగ్, రోజువారీ కూలీ పనులు చేస్తూ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటూ, మద్యం అలవాటు కారణంగా డబ్బుల కోసం రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా కనిపించే వ్యక్తులను బెదిరించి, కొట్టి డబ్బులు దోచుకునే వాడు. గత నెల 6న అర్థరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లక్ష్మీ లాడ్జ్ పక్కన శ్రీనివాస కిరాణా షాప్ ముందు ఒక పెద్దాయన డబ్బులు లెక్కబెడుతూ కనిపించాడు. దాంతో అతనిని చంపివేసైన డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశ్యంతో అతని దగ్గరకు వెళ్లి, డబ్బుల కోసం అతన్ని బెదిరించి, కొట్టాడు. కానీ ఆ పెద్దాయన డబ్బులు ఇవ్వకపోవడంతో, నిందితుడు ఒక బట్టతో అతని మెడకు ఉరి బిగించి హత్య చేసి, అతని వద్ద నుండి రూ.2వేల నగదు, ఫోన్ దోచుకున్నాడు. బుధవారం నిందితున్ని అరెస్ట్ చేసి కోర్ట్ ఎదుట హాజరుపరచి, జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
