నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనాలని ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్ జిల్లా పరిధిలో కురిసిన అకాల వర్షాల వలన వేలాది మంది రైతుల కష్టార్జిత పంటలు తడిసి పాడవుతున్నాయన్నారు. పంటను రక్షించుకునే స్థితిలో రైతులు లేరని, ఈ పరిస్థితుల్లో రైతుల ఆర్థిక నష్టం తీవ్రంగా పెరుగుతోందని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు భరోసా కల్పించాలని తెలిపారు. ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాములు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.500 బోనస్‌ను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రఫీ ఉద్దీన్, సయ్యద్ ఖలేం, గోపాల్ సింగ్ ఠాగూర్, శివ తదితరులు పాల్గొన్నారు.
