. . . హై కోర్ట్ సంచలన ఆదేశాలు
. . . ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్ కు సూచన
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ హైకోర్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్‌గా కొనసాగుతున్న రంగనాథ్‌ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని ధర్మాసనం సూచించింది. మేడ్చల్ జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేస్తూ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. న్యాయస్థానాలపై, దేశ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివాదాస్పద 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. అయితే పిటిషనర్ వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు కథనాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హైడ్రా కమిషనర్ ఆరోపించారు. జరిగిన పరిణామాలపై న్యాయస్థానాన్ని గౌరవిస్తూ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆయనపై దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తు చేసింది. లోతుకుంట భూముల విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, అండర్‌టేకింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రాంతానికి వెళ్లడంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. “ఒకే అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? కోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించకుండా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రంగనాథ్ ఇదే విధంగా హైడ్రా కమిషనర్‌గా కొనసాగితే రూల్ ఆఫ్ లా దెబ్బతినే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని అదే పదవిలో కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని సీఎస్ సంజయ్ జాజుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే హైడ్రా బాధ్యతలను ఐజీ స్థాయి అధికారికి అప్పగించాలని సూచించింది.