23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్కార్ ఆఫీసులో మౌలిక వసతుల కరవు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారులు, ప్రజలకు ఇబ్బందులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక వసతుల కొరత కారణంగా అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో తగిన బాత్రూమ్ సదుపాయాలు, అదనపు గదులు లేకపోవడంతో రోజువారీ కార్యకలాపాలు ఇబ్బందికరంగా మారినట్లు స్థానికులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం పక్కనే మూతపడిన పాత భవనం ఉండటంతో అది ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భవనంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, విషపురుగులు పెరిగే అవకాశం ఉందని, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే సమయంలో, కార్యాలయంలో ఇరుకైన గదులు ఉండటం వల్ల అధికారులు, సిబ్బంది తమ విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, సదాశివనగర్ తహసీల్దార్ సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మండల ప్రజలు ప్రశంసించారు. అలాగే కార్యాలయ సిబ్బంది రేషన్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని స్థానికులు అభినందించారు. అయితే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కార్యాలయంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం, ప్రమాదకరంగా ఉన్న పాత భవనాన్ని తొలగించడం అత్యవసరమని మండల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article