. . . పాలకులను తిట్టండి, ప్రజలను కాదు
. . . పాలకులు వేరు.. ప్రజలు వేరు
. . . తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
. . . జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్, బతుకమ్మ :
ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేష రాజకీయాలు మరింత ప్రమాదకరమని, తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే బాధ్యులుగా చూపించడం సరికాదని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ నాయకుడిపై కూడా విమర్శలు చేయలేదని, వివాదాలను రెచ్చగొట్టడం తన స్వభావం కాదని స్పష్టం చేశారు. ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైందని, ఆ విశ్లేషకుడిపై కేసులు నమోదైన విషయం మొదట్లో తనకు తెలియదని చెప్పారు. విషయం తెలిసిన తర్వాత కేసులు ఉపసంహరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రతి సమస్యకు ఆంధ్ర ప్రజలనే కారణమని చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్న పవన్, ఇలాంటి ధోరణుల వల్లే వామపక్ష భావజాలం బలహీనపడిందని వ్యాఖ్యానించారు. తనపై చెరువు ఆక్రమణ ఆరోపణలు వస్తున్నాయని, అవి నిజమైతే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై గౌరవం ఉందని చెబుతూ, ఆరోపణలు నిజమని తేలితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అన్నారు. దాడులు చేస్తామని బెదిరింపులు రావడంతోనే తన ఇంటి వద్దే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను బాధ్యులను చేయకూడదని, పాలకులు వేరు, ప్రజలు వేరని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని, అయితే సామాన్య ప్రజలపై విద్వేషం పెంచడం తగదని పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు ప్రజలు నివసిస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించడం సరైన విధానం కాదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ అవసరమా అని నిలదీశారు. ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను జనసేన అంగీకరించదని, బెదిరింపులు పెరిగే కొద్దీ తమ సంకల్పం మరింత బలపడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న బెదిరింపుల రాజకీయాలకు ముగింపు పలుకుతామని, ప్రతి అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
