25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రికవరీ కిరికిరి

Must read

📰 Generate e-Paper Clip

  • నేను చెల్లించాల్సింది రూ.7కోట్లే.. కాదు రూ.60 కోట్లు
  • మాజీ ఎమ్మెల్యే షకీల్ చెబుతున్నది ఒకలా.. అధికారులు లెక్కల్లో మరోలా..
  • మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రభుత్వం
  • స్పష్టత లేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం
  • 48 మిల్లులపై కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం
  • మొత్తం రికవరీ కావాల్సింది రూ.260 కోట్లు

 

నిజామాబాద్, బతుకమ్మ: కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లు రికవరీ ప్రక్రియ కిరికిరిగా మారింది. మిల్లర్ల నుంచి రికవరీ అవ్వాల్సింది ఇంత అని అధికారులు చెబుతుండగా, మిల్లర్లు మాత్రం కాదు కాదు.. తాము చెల్లించాల్సిందే ఇంతే అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒక్కరి నుంచే రూ.60 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటుండగా, ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో షకీల్ ప్రసంగిస్తూ రూ.7 కోట్ల బకాయిలు చెల్లించాలని తనకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని, తాను వందల కోట్ల విలువైన ధాన్యం అక్రమాలకు పాల్పడినట్లు అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికారులు, షకీల్ చెబుతున్న లెక్కల్లో తేడా ఎందుకు అంత మొత్తంలో ఉంది? అసలు షకీల్ చెల్లించాల్సింది ఎంత అనేదానిపై చర్చ సాగుతోంది. షకీల్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న రైస్ మిల్లులకు ఇచ్చిన సీఎంఆర్ మొత్తం విలువను షకీల్ చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారా? లేక షకీల్ ఒక్కరే అధికారులు చెబుతున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉందా? అనేదానిపై స్పష్టత కరువైంది. ఈ పరిస్థితి ఒక్క షకీల్ వరకే పరిమితం కాలేదు. మిగతా మిల్లర్లు కూడా తాము చెల్లించాల్సింది ‘ఇంతే’ అంటున్నారు.

డిఫాల్టర్లుగా గుర్తించిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 48 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి మొత్తం రూ.260 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. సీఎంఆర్ అక్రమాల్లో మిల్లర్లకు అధికారులే సహకరించారనేది ఒకటి రెండు ఘటనలు రుజువు చేశాయి. కోటగిరి పోలీస్ స్టేషన్ లో ముందుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ తోపాటు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.  ఈ వ్యవహారంలో డీఎస్ వోతోపాటు డీఎంలను సస్పెండ్ చేశారు. వర్నిలోని శ్రీనివాస రైస్ మిల్లు యజమాని కిశోర్ హై కోర్టుకు వెళ్లగా ఏకంగా అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన చంద్రశేఖర్ తోపాటు డీఎస్ వో చంద్రప్రకాశ్, డీటీ నిఖిల్ రాజ్ పై కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.

  • స్పష్టత ఎప్పుడొస్తుందో..

సీఎంఆర్ రికవరీ పై స్పష్టత ఎప్పుడొస్తుందోనని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కుంభకోణంగా సీఎంఆర్ మిగిలింది. నాడు హడావుడి చేసిన అధికారులు కోటగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసులు నమోదై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని ప్రకటించడం, షకీల్ అరెస్టు అంటూ ప్రచారం జరగుతుండగా ఆయన కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో ఒక్కరి వద్దనే రూ.60కోట్లకు పైగా సీఎంఆర్ రికవరీ విషయంలో బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చినా చెల్లింపులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రారంభంలో హడావుడి చేసిన అధికారులు తరువాత స్తబ్దుగా ఉండిపోవడంతో రికవరీ ప్రక్రియ నెమ్మదించింది.

More articles

Latest article