. . . భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
కామారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో సోమవారం భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న, జొన్న పంటలకు సరైన ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సాగు ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
