నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ విశ్వ విద్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరిపాలనా భవనం ముందు తెలంగాణ యూనివర్సిటీ వైస్ -ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ప్రో.ఎం.యాదగిరి తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైస్ -ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు ఇదని శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భమన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన రోజన్నారు. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామమే ఈరోజుకున్న ప్రాధాన్యత అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. ఈ దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17 అని అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షరంగా లిఖితమైందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల, డైరెక్టర్ ప్లేస్మెంట్ సెల్ డాక్టర్ నాగరాజు పాత, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ శాంతాబాయి, డైరెక్టర్ పి ఆర్ ఎ.డాక్టర్ ఏ పున్నయ్య, పిడి డాక్టర్ నేత, తెలంగాణ విశ్వవిద్యాలయ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
