24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంప్లాయిస్ కు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ బకాయి పడిన నాలుగు వాయిదాల కరవుభత్యాలను, జూలై 2023 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి  చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు సమయమిచ్చామని, ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో మరియు ప్రజల్లోనూ భాగంగా ఉన్నారని వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాల జెఎసి ప్రతినిధులతో జరిపిన సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం చేస్తామని, ఈ లోగా ఆర్థిక భారం లేని సమస్యలను శాఖలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని తెలిపారు.మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటివరకు ఏ శాఖ ప్రతినిధులతోనూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగలేదని అన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అనే తేడా లేకుండా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదని, సాధారణ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి తీవ్రమై పోరాటానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాడ్ చేశారు.

More articles

Latest article