25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పూర్వ ట్రెసానే నయం

Must read

📰 Generate e-Paper Clip

  • మననం చేసుకుంటున్న రెవెన్యూ ఉద్యోగులు
  • అప్పట్లో విధులు, యూనియన్ బాధ్యతలు
  • ప్రస్తుతం ‘ముదిమి’లో నాయకత్వం

నిజామాబాద్ బతుకమ్మ : అప్పట్లో రెవిన్యూ విభాగంలో నిస్పక్షపాతంగా విధులు నిర్వహించిన నాయకులే నయం. తమకు కేటాయించిన వృత్తి ధర్మాలను సక్రమంగా నిర్వహిస్తూనే, నాయకత్వాన్ని నడిపించారని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు (ట్రెస్మా సంఘం బాధ్యులు) మననం చేసుకుంటున్నారు. శాఖలో ఏ ఉద్యోగికైనా ఇబ్బందులు ఎదురైతే వెన్నంటే ఉండి నెరవేర్చేవారని మాట్లాడుకుంటున్నారు. గత ఏడేళ్లుగా నాయకత్వం నుంచి సమస్యలు వస్తే తాము ఉన్నామనే భరోసా మాటలు చెవులకు వినిపించిన దాఖలాలు లేవని ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

విధులు నిర్వహిస్తూనే.. 

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ట్రెసా నాయకత్వానికి ముందు నాయకులు తమ విధులకు ప్రాధాన్యమిచ్చారు. ఆ పని అనేది ప్రజలకు సేవ చేయడానికి అని గుర్తెరిగారు. అది చేసేందుకు ప్రభుత్వం వేతనంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తుంది. దీంతో పాటు ప్రజాసేవ చేయడం వల్ల సంఘంలో పరపతి పెరుగుతుందని గ్రహించిన అప్పటి ట్రెసా నాయకులు తమకు కేటాయించిన శాఖకు తొలి ప్రాధాన్యమిచ్చారు. గమనించిన రెవెన్యూ ఉద్యోగులు నాయకత్వ బాధ్యతలను మనస్పూర్తిగా అప్పగించడంతో విధులు నిర్వహిస్తూనే సహోద్యోగుల సమస్యలను పరిష్కారమయ్యేలా చూశారు. చాలా ఏళ్లుగా నాయకులుగా ఉన్న రవీందర్ తహసీల్దార్ గ పనిచేశారు. ఇదే కోవలో విశ్వనాథ్, సూర్య ప్రకాష్ సైతం విధులు నిర్వహిస్తూనే నాయకత్వాన్ని బాద్యతాయుతంగా మోసారు.

ముదిమిలో ప్రస్తుత నాయకత్వం..

ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెసా సంఘం అప్పటి నాయకత్వానికి పూర్తిగా పూర్తి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి నాయకత్వం విధులకు ఎగనామం పెట్టి సొంత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. యూనియన్ బాద్యతలను మరొకరికి అప్పగించకుండా దాన్ని అడ్డుపెట్టుకొని ఇలా చేయడం సంస్కారవంతమైన పని కాదనే వాక్యాలు రెవిన్యూ ఉద్యోగుల నుంచి వినపడుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ”ముదిమి” అడ్డొస్తుందని, యూనియన్ లో యువతను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో యువనాయకత్వన్ని ఎన్నుకున్నారు. ఫలితంగా “ఏరు దాటాక తెప్పను తగలబెట్టినట్లు” నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాక విధులు నిర్వహించేందుకు కార్యాలయపు ‘మోము’ చూడలేని పరిస్థితి ఏళ్ల తరబడిగా తయారయింది. ఒక శాఖలోనైతే ఏడాది వెళ్ళకున్నా జీతం ఇవ్వడంతో పాటు ఇతర అలవెన్సు (సౌకర్యాలు)లను యూనియన్ నాయకులనే భయంతో చెల్లింపులు చేశారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఉభయ జిల్లాల్లో పెద్ద చర్చ జరిగిన దరిమిలా రెవెన్యూ ఉద్యోగుల నుంచి ట్రెసా పై ఈసడింపులు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం ఉన్న నాయకత్వం ‘ముదిమి’లో ఉండడం వల్లే విధులకు రాకుండానే బట్వాడాలు తీసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. యువ నాయకత్వమని చెప్పుకొని తిరుగుతున్న ప్రస్తుత నాయకులు విధులకు, యూనియన్ కు న్యాయం చేయకపోవడంతో వీళ్ళు ముదిమికి దగ్గరలో ఉన్నట్లు ఉన్నారని నవ్వకోవడం రెవిన్యూ ఉద్యోగులలో కనిపిస్తుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా…లోపల నుంచి ఆరోగ్యం సహకరించకపోవడంతోనే విధులకు ఎగనామం పెడుతూ, యూనియన్ ను సొంత పనులకు వాడుకుంటున్నారనే చలోక్తులు రెవెన్యూ వర్గం ముఖ్యంగా మహిళామణుల నుంచి వినపడుతున్నాయి.

More articles

Latest article