. . . నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను, మాక్లూర్ పోలీస్ స్టేషన్ లను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆలీ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజి మల్టీజోన్ వన్ చంద్రశేఖర్ తో కలిసి రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ నేర రహిత సమాజం సిసి కెమెరాల నిఘా, క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరు స్తుందని అన్నారు.సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పోలీసింగ్, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణకు కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీపీ సాయి చైతన్య, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

