. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఫీజు రీయెబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయాలని, ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టే కళాశాల బంద్ కు కళాశాల యజమాన్యాలు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. బుధవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ చేపట్టాలని పిలుపు మేరకు ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్, ఫార్మసి, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫిజియోథెరపీ తదితర కాలేజీలు బంద్ చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాత పద్ధతిలోనే ఫీజుల రీ ఎంబర్స్ మెంట్ స్కీమును యధావిధిగా అమలు చేయాలని, గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల మద్దతుతో గురువారం విద్య కాలేజీల బంద్ చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు నేటి బంద్ కి సహకరించి తమ కళాశాలలను బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ జేఏసీ చేస్తున్న ఈ ఉద్యమానికి మీ వంతుగా జులై 2న కాలేజీకి సెలవు ప్రకటించి, బడుగు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఈ ఉద్యమానికి సంపూర్ణంగా సహకరించాలని కాలేజీల యాజమాన్యానికి నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ శంకర్, కొట్టూర్ చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, లక్ష్మణ్ గౌడ్, రేఖ, అవుసుల రాము తదితరులు పాల్గొన్నారు.
