. . . ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
. . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నుండి ప్రజలను రక్షించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిజామాబాద్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని శనివారం కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్ఓ) కి, రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి కి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు, పివైఎల్ జిల్లా కార్యదర్శి సాయిబాబా లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ (హైస్కూల్స్ & కాలేజీ) విద్యాసంస్థల యాజమాన్యాలు సామాన్య, మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని, ఆశలను, ఆసరాగా చేసుకుని అడ్డు అదుపు లేకుండా, రకరకాల పేర్లతో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యారంగాన్ని వ్యాపారమయంగా మార్చి వేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం, ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తూన్న ఫీజుల భారాన్ని మోయలేక ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులను సైతం అమ్ముకుంటూ ఆర్థికంగా, మానసికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అదనపు సెక్షన్లు, బ్రాంచ్ లు నెలకొల్పుకుంటున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా వారి ఫీజుల దోపిడీకి కొమ్ముకాస్తూన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు నితిన్, సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు హేమాంజలి, రేహాన్, మున్నా, మనితేజ, మల్లేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

