- రూ.8 లక్షలు రికవరీ, ఇద్దరు నిందితులు అరెస్ట్
- ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదించి రూ.8 లక్షలు రికవరీ చేసి ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ బండి నరేందర్ గతనెల 30న తాను పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూ.8లక్షల నగదు రాత్రి దొంగిలించబడినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా నిందితులను గుర్తించి, విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేశారు. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేష్, పత్తి సాయి కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8లక్షల నదు, మోటార్ సైకిల్, ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పత్తి సాయికుమార్ గత 3 సంవత్సరాలుగా ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగ రీత్యా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు తీసుకొని వస్తారు. వాటిని ఎక్కడ ఉంచుతారు అన్న సమాచారం అతనికి తెలుసు. ఈ కారణంగా సాయికుమార్ కు పెన్షన్ డబ్బులు కాజేయాలనే ఆలోచన కలిగింది. తన దగ్గరి స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేష్ కు ఈ పథకం వివరించగా, రాకేష్ కూడా అంగీకరించాడు. 2025 ఆగస్టు 29వ తేదీన సాయికుమార్ కు పరిచయం ఉన్న సహోద్యోగి మామిడిపల్లి బీపీఎం నరేంద్ర పెన్షన్ పంపిణీ కోసం రూ.8లక్షలు నిజామాబాద్ ఆఫీస్ నుండి తెచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు అనే విషయం సాయికుమార్‌కు తెలిసింది. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ మామిడిపల్లి గ్రామానికి వెళ్లి, పథకం ప్రకారం రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తిగా నరేంద్ర ఇంట్లో ఆశ్రయం పొందేలా చేశాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత, రాకేష్ అక్కడి నుండి పెన్షన్ డబ్బులు గల బ్యాగ్‌ను దొంగిలించి, సాయికుమార్ వద్దకు తీసుకెళ్లాడు. తరువాత ఇద్దరూ కలసి డబ్బులు ఎవరికి అనుమానం రాకుండా సాయికుమార్ ఇంట్లో దాచిపెట్టారు. మక్లూర్ పోలీసులు సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో మొత్తం నగదు తిరిగి రికవరీ చేయబడింది. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ కు హాజరు పరిచారు. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా పక్కా సాంకేతిక ఆధారంతో నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసును చేదించడంలో కృషిచేసిన, మాక్లూర్ ఎస్ఐ ఎం. రాజశేఖర్, సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తద్రి గౌడ్, రాజు, చరణ్, ఐటీ కోర్ సిబ్బంది సాగర్, సందీప్ లను అభినందించారు.